రాయ్‌పూర్ : బీజేపీ తన దివాళాకోరు విధానాలతో దేశాన్ని ప్రమాదకర పరిస్ధితిలోకి నెట్టివేస్తోందని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఆరోపించారు. దేశాన్ని కొందరు అత్యంత కుబేరులకు చెందినదిగా, కోట్లాది పేదలతో కూడిన రెండు దేశాలుగా కాషాయ పార్టీ విభజిస్తోందని మండిపడ్డారు. దేశానికి చెందిన పేదలు పాలకులకు భయపడతారని వారు భ్రమల్లో ఉన్నారని..అయితే పేదలు ఎవరికీ భయపడరని రాహుల్ స్పష్టం చేశారు.
అభివృద్ధి ఏ ఒక్క పార్టీ సొత్తు కాదని పేదలు, రైతాంగం, కార్మికులు 70 ఏండ్లుగా దేశాన్ని ఈ స్ధితికి తీసువచ్చారని అభివృద్ధి వెనుక వారి స్వేదం ఉందని పేర్కొన్నారు. దేశంలో 100 మంది సంపన్నుల వద్ద దేశంలోని 40 శాతం పేదల కంటే ఎక్కువ సంపద పోగుపడిందని రాయ్‌పూర్‌లో గురువారం జరిగిన ర్యాలీలో పేర్కొన్నారు. పేదలు, ధనికుల మధ్య అంతరాలు పెరిగాయని.. కేవలం కొద్దిమంది వ్యాపారులే కాకుండా దేశం యావత్తూ పురోగతి సాధించాలని తాము కోరుకుంటున్నామని చెప్పారు. భిన్న సిద్ధాంతాలు, సంస్కృతులు, భాషల సమ్మిళితమే హిందుస్ధాన్ అని కాని వారు ఒకే సిద్ధాంతంతో దేశాన్ని పాలించాలని కోరుకుంటున్నారని అన్నారు.
కాషాయపార్టీ నేతల ఆకాంక్షలు నెరవేరవని తాను బుధవారం పార్లమెంట్ వేదికగా చెప్పానని అన్నారు. బీజేపీకి నిజమైన హిందుస్తాన్‌ను తాము చూపుతామని చెప్పారు. కాగా రాహుల్ పార్లమెంట్లో చేసిన వ్యాఖ్యలను బీజేపీ తోసిపుచ్చింది. ఇందిరానే ఇండియా అనే మైండ్‌సెట్ నుంచి కాంగ్రెస్ బయటపడాలని కేంద్ర మంత్రి ముక్తార్ అబ్బాస్ నక్వీ అన్నారు. కాంగ్రెస్ అంటేనే భారత్, భారత్ అంటే కాంగ్రెస్ అనే భ్రమలను వీడితే రాహుల్‌కు రెండు భారత్‌లు కనిపించవని ఆయన ఎద్దేవా చేశారు.