Rahul Gandhi : బీహార్‌లోని బెగుసరాయ్‌లో కాంగ్రెస్ అనుబంధ సంస్థ ఎన్ఎస్యూఐ (NSUI) నేషనల్ ఇన్చార్జి కన్హయ్య కుమార్ ఆధ్వర్యంలో నిర్వహించిన ర్యాలీలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన బీహార్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. యువతకు ఉద్యోగాలు ఏవని ప్రశ్నించారు. బీహార్ ప్రభుత్వ అధికారులు, రాజకీయ నేతలు పారిపోవద్దని.. యువతకు ఉద్యోగాలివ్వాలని డిమాండ్ చేశారు.
ప్రభుత్వం చేస్తున్న తప్పుడు ప్రచారాలను ప్రజలు ఇక నమ్మరని, మోసపోరని చెప్పారు. తమ భవితవ్యాన్ని తాము రాసుకోవడానికి బీహార్ యువత సిద్ధంగా ఉన్నారని తెలిపారు. కాగా ఆదివారం కూడా రాహుల్ గాంధీ మీడియాతో మాట్లాడుతూ.. బీహార్‌లో నిర్వహిస్తున్న ‘వైట్ టీ-షర్ట్’ ఉద్యమంలో యువత పెద్దఎత్తున పాల్గొనాలని కోరారు. విద్యార్థులు ఉద్యోగాల కోసం ఇతర రాష్ట్రాలకు వలసలు వెళ్లడం ఆపాలని, అందరం కలిసి రాష్ట్రంలో పెరుగుతున్న ద్రవ్యోల్బణం, నిరుద్యోగం, ప్రైవేటీకరణ, పేపర్ లీక్‌లు మొదలైన సమస్యలపై పోరాటం చేద్దామని పిలుపునిచ్చారు.
రాహుల్ గాంధీ వ్యాఖ్యలపై బీజేపీ స్పందించింది. రాహుల్‌గాంధీ ఎక్కిడికి వెళ్లినా కాంగ్రెస్ ఓడను ముంచేస్తారని, బీహార్‌లో కూడా ముంచేందుకే వచ్చారని ఎద్దేవా చేసింది. కాగా ఈ ఏడాది చివరలో బీహార్ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ ఇటీవల రాష్ట్రంలో 40 సంస్థాగత జిల్లాలకు కొత్త అధ్యక్షులను ప్రకటించింది. బీహార్‌లో అయినా గెలుపొందాలని కాంగ్రెస్ నేతలు కొత్త వ్యూహాలు రచిస్తున్నారు. మరోవైపు మళ్లీ అధికారం దక్కించుకోవడానికి ఎన్డీఏ ప్రభుత్వం సిద్ధమవుతోంది.