ఎన్నికలు దగ్గరపడుతున్న వేళ అధిష్ఠానంపై సంచలన వ్యాఖ్యలు చేస్తూ విరుచుకుపడ్డ మాజీ ముఖ్యమంత్రి హరీశ్ రావత్‌ను బుజ్జగించే పనిలో కాంగ్రెస్ నిమగ్నమైంది. కాంగ్రెస్ అగ్రనేత, ఎంపీ రాహుల్ గాంధీ మాజీ సీఎం హరీశ్ రావత్‌తో భేటీ అయ్యారు. ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ సీనియర్ల నుంచి ఈ ధిక్కార స్వరం వినడం ఏమాత్రం శ్రేయస్కరం కాదని భావించిన పార్టీ పెద్దలు, రావత్‌ను శాంతింపజేయడానికి ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. అసెంబ్లీ ఎన్నికలు తమ సారథ్యంలోనే నడవాలని, అధిష్ఠానం నుంచి పూర్తి మద్దతు మీకు ఉంటుంది అని రాహుల్ గాంధీ రావత్‌తో అన్నట్లు పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. దీంతో రావత్ మెత్తబడినట్లు సమాచారం.
హైకమాండ్ తనను ఈదమని చెప్పి, కాళ్లు, చేతులను కట్టేస్తోదంటూ హరీశ్ రావత్ కొన్ని రోజుల క్రితం సంచలన వ్యాఖ్యలు చేశారు. తన ట్వీట్లో ఎవ్వరి పేరు తీసుకోకపోయినా, గాంధీ పరివారాన్ని ఉద్దేశించే మండిపడ్డారన్నది అందరికీ తెలిసిందే. ఎన్నికలనే మహా సముద్రంలో తాను ఈదుతున్నానని, ఈ సమయంలో పార్టీ ప్రతిపక్ష పార్టీ పోషిస్తోందని మండిపడ్డారు. కొత్త సంవత్సరం తనకు కొత్త దారి చూపిస్తుందని ఆశాభావం వ్యక్తం చేస్తూ ట్వీట్ చేశారు. ఈ ట్వీట్ పార్టీలో కొత్త చర్చకు దారి తీసింది. ఈ నేపథ్యంలో రాహుల్, రావత్ భేటీ కావడం ప్రాధాన్యాన్ని సంతరించుకుంది.