న్యూఢిల్లీ: అయోధ్యలో రామ్‌లల్లా ప్రతిష్టాపనను స్వాతంత్య్ర దినోత్సవంగా జరుపుకోవాలని ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ చేసిన వ్యాఖ్యలను కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ(Rahul Gandhi) తీవ్రంగా తప్పుపట్టారు. ఇవాళ ఢిల్లీలో ఇందిరా గాంధీ భవన్లో జరిగిన కార్యక్రమంలో రాహుల్ గాంధీ మాట్లాడుతూ మోహన్ భగవత్ చేసిన వ్యాఖ్యలు దేశద్రోహం కిందకు వస్తాయన్నారు. మరో దేశం అయితే ఆయన్ను అరెస్టు చేసేవారని ఆరోపించారు. ఆ కేసులో భగవత్‌ను విచారించేవారన్నారు.
శ్రీ రామజన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్టు ప్రధాన కార్యదర్శి చంపత్ రాయ్‌కి మంగళవారం ఇండోర్‌లో జరిగిన కార్యక్రమంలో జాతీయ దేవి అహల్య అవార్డును భగవత్ అందజేశారు. ఆ కార్యక్రమంలో భగవత్ మాట్లాడుతూ.. అయోధ్యలో శ్రీరాముడి ప్రతిష్ట దినోత్సవాన్ని.. నిజమైన స్వాతంత్య్ర దినోత్సవంగా జరుపుకోవాలన్నారు. భారత దేశం పలు శతాబ్ధాల పాటు శత్రు దాడులతో సతమతం అయ్యిందన్నారు. బ్రిటీష్ పాలకుల నుంచి 1947, ఆగస్టు 15వ తేదీన భాతర్‌కు రాజకీయ స్వాతంత్య్రం వచ్చిందని భగవత్ తెలిపారు. ఆ తర్వాత రాసిన రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నారన్నారు. కానీ ఆ రాజ్యాంగం ఆ నాటి స్పూర్తికి తగినట్లు లేదన్నారు.
అయితే భగవత్ చేసిన వ్యాఖ్యలను రాహుల్ గాంధీ విమర్శించారు. భారత స్వాతంత్రోద్యమం గురించి ప్రతి రెండు మూడు రోజులకు ఒకసారి ఆర్ఎస్ఎస్ చీఫ్ మాట్లాడుతున్నారు. కానీ ఆయన ఇండోర్‌లో మాట్లాడిన వ్యాఖ్యలు దేశద్రోహం కిందకు వస్తుందన్నారు. రాజ్యాంగం చెల్లదు అన్నట్లు ఆయన మాట్లాడుతున్నారని విమర్శించారు. పబ్లిక్‌గా.. ధైర్యంగా ఆయన మాట్లాడుతున్నారని, మరో దేశంలో అయితే ఆయన్ను అరెస్టు చేసేవారని రాహుల్ పేర్కొన్నారు. 1947లో భారత్‌కు స్వాతంత్ర్యం రాలేదనడం ప్రతి భారతీయుడికి అవమానమే అన్నారు.