న్యూఢిల్లీ : కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీపై (Rahul Gandhi) అనర్హత వేటు నేపధ్యంలో ఢిల్లీలోని లూటెన్స్ అధికారిక నివాసాన్ని ఏప్రిల్ 22లోగా ఖాళీ చేయాలని అధికారులు ఆయనను కోరినట్టు తెలిసింది. ప్రభుత్వం కేటాయించిన బంగళాను ఖాళీ చేయాలని కోరుతూ రాహుల్ గాంధీకి లోక్‌సభ హౌసింగ్ కమిటీ సోమవారం నోటీసు జారీ చేసినట్టు సమాచారం.
2004లో రాహుల్ ఎంపీగా ఎన్నికైన అనంతరం ఆయనకు 12 తుగ్లక్ లేన్ బంగళాను కేటాయించారు. 2019లో దాఖలైన పరువు నష్టం కేసులో సూరత్ కోర్టు రాహుల్‌కు రెండేండ్ల జైలు శిక్ష విధించడంతో ఎంపీగా రాహుల్ గాంధీపై లోక్‌సభ సెక్రటేరియట్ అనర్హత వేటు వేసింది. ఇక ఈ కేసులో రాహుల్‌కు సూరత్ కోర్టు బెయిల్ మంజూరు చేస్తూ తీర్పుపై 30 రోజుల్లోగా ఎగువ కోర్టును ఆశ్రయించేందుకు అనుమతించింది.
ఇక ఎగువ కోర్టులో రాహుల్ నిర్ధోషిత్వం రుజువై, శిక్షను నిలిపివేయని పక్షంలో ఆయన ఎనిమిదేండ్ల పాటు ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం కోల్పోతారు. ఇక నిబంధనల ప్రకారం అనర్హత ఉత్తర్వులు జారీ చేసినప్పటి నుంచి నెలరోజుల్లోగా రాహుల్ తన అధికారిక నివాసాన్ని ఖాళీ చేయాల్సి ఉంటుంది.
రాహుల్‌కు సూరత్ కోర్టు విధించిన శిక్షతో పాటు అనర్హత వేటుపై న్యాయపరంగా, రాజకీయంగా పోరాటం చేపడతామని కాంగ్రెస్ స్పష్టం చేసింది. అదానీతో మోదీకి ఉన్న బంధాన్ని పార్లమెంట్లో ప్రశ్నించినందుకే రాహుల్‌పై అనర్హత వేటు వేశారని కాంగ్రెస్ సహా విపక్షాలు మోదీ సర్కార్‌పై భగ్గుమన్నాయి.
Read More :