Raghu Ram Rajan | ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ తన రాజకీయ రంగ ప్రవేశంపై కీలక వ్యాఖ్యలు చేశారు. తాను రాజకీయాల్లోకి రావడం తన కుటుంబానికి ఇష్టం లేదని పేర్కొన్నారు. తాను కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారని వస్తున్న వార్తలపై ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తాను విద్యావేత్తనని పేర్కొంటూ.. రాజకీయాల్లో తాను చేరడానికి తన కుటుంబానికి, తన భార్యకు ఇష్టం లేదన్నారు. రాజకీయాల్లో చేరడానికి బదులు తనకు సాధ్యమైనంత సాయం చేయాలనుకుంటున్నానని చెప్పారు. తాను ప్రభుత్వంలో ఉన్నా, లేకున్నా.. ప్రభుత్వ విధానాలు దారి తప్పితే వాటి గురించి తప్పకుండా స్పందిస్తానని స్పష్టం చేశారు. రాజకీయాల్లో ఉండాలన్నా, జనం మధ్య ఉండాలన్న తన వల్ల కాదని పేర్కొన్నారు.
రాహుల్ గాంధీ తెలివైన వ్యక్తి, ధైర్యవంతుడని, ఆయనకు తాను సలహాలు ఇచ్చాననుకోవడం పొరపాటే అవుతుందని రఘురామ్ రాజన్ చెప్పారు. నానమ్మ, తండ్రిని కోల్పోయిన వారి కుటుంబం గురించి తక్కువ చేసి మాట్లాడకూడదనుకున్నానన్నారు. కొవిడ్ సమయంలో రాహుల్ సరిగ్గానే వ్యవహరించారన్నారు. అయితే రాహుల్ గాంధీ వద్ద అన్ని సమాధానాల్లేవని అంగీకరించారు. కానీ అందరూ చిత్రీకరిస్తున్న దానికంటే భిన్నమైన వ్యక్తి రాహుల్ గాంధీ అని, పలు అంశాలపై ఆయనకు స్పష్టత ఉందన్నారు. రాహుల్ అభిప్రాయాలతో ఏకీభవించని వారితో చర్చలకు ఆయన సిద్ధంగానే ఉన్నారన్నారు.