Ragging @ CMC | తమిళనాడు వెల్లూర్‌లోని క్రిస్టియన్ మెడికల్ కాలేజీ (సీఎంసీ) లో ర్యాగింగ్ భూతం జడలు విప్పింది. గత నెల 9 న జరిగిన ఈ ఘటన వివరాలు ఆలస్యంగా వెలుగులోకి వచ్చాయి. కొత్తగా కాలేజీకి వచ్చిన విద్యార్థులను సీనియర్లు ర్యాగింగ్ చేస్తున్న వీడియో ఒకటి సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. దాంతో సీఎంసీ వ్యవహారం కాస్తా ముదిరిపాకాన పడింది. కాలేజీ హాస్టల్లో ర్యాగింగ్‌ను కాలేజీ యాజమాన్యం సీరియస్‌గా తీసుకుని విద్యార్థులపై చర్యలకు ఉపక్రమించింది.
వెల్లూర్‌లోని క్రిస్టియన్ మెడికల్ కాలేజీలో ర్యాగింగ్ జరిగింది. ఈ ర్యాగింగ్ వీడియోను అక్కడే చదువుతున్న ఓ విద్యార్థి ట్విట్టర్లో పోస్ట్ చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది. మెన్స్ హాస్టల్ క్యాంపస్‌లో జూనియర్లను బట్టలూడదీసి చెడ్డీలపై క్యాట్ వాక్ చేయించారు. పైపులతో నీరు చల్లుతూ, కర్రలు, బెల్టుతో కొడుతూ ఎంజాయ్ చేశారు. అక్కడే ఉన్న ఓ బురద గుంటలో పడుకోవాలని, ఒకరినొకరు రుద్దుకోవాలని ఆజ్ఞాపించి వికృతంగా ప్రవర్తించారు. అయితే, ర్యాగింగ్ ఘటనను సీరియస్‌గా తీసుకున్న కాలేజీ యాజమాన్యం ప్రాథమిక విచారణ జరిపి.. ర్యాగింగ్‌కు పాల్పడిన ఏడుగురు విద్యార్థులపై సస్పెన్షన్ వేటు వేసింది. ఈ విషయాన్ని సీఎంసీ ప్రిన్సిపాల్ డాక్టర్ సాల్మన్ సతీష్‌కుమార్ మంగళవారం తెలిపారు.
Video proof of severe ragging in Christian Medical College, Vellore. Kindly share and expose the acts occuring here for society to know the problems in not only this institution but widespread among other medical colleges in various degrees. pic.twitter.com/si6lAGCZh0
— cmcvellorestudent (@studenxperience) November 6, 2022
ర్యాగింగ్ జరిగిన విషయాన్ని తొలుత గుర్తుతెలియని వ్యక్తి ఒకరు కాలేజీ యాజమాన్యానికి ఉప్పందించారు. దాంతో విచారణ కమిటీని నియమించి వారు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఏడుగురు విద్యార్థులను బాధ్యులుగా తేల్చారు. వారిని కాలేజీ నుంచి సస్పెండ్ చేస్తూ కాలేజీ యాజమాన్యం నిర్ణయించింది. ర్యాగింగ్ ఘటనపై మరింత లోతుగా విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని పేర్కొన్నది. ఇలాంటి సంఘటనలను ఎంత మాత్రమూ ఉపేక్షించేది లేదని, బాధ్యులు ఎవరైనా శిక్ష అనుభవించాల్సిందే అని స్పష్టం చేసింది. కాగా, ఘటనతో సంబంధమున్న కాలేజీ సిబ్బందితోపాటు హాస్టల్ వార్డెన్‌పై కూడా చర్యలు తీసుకోవాలని పలువురు విద్యార్థులు డిమాండ్ చేశారు.