న్యూఢిల్లీ, సెప్టెంబర్ 2: మన దంతాలను శుభ్రం చేసుకోవడానికి ‘ఏఐ టూత్‌బ్రష్’ కూడా వచ్చేసింది. ఇది మామూలు టూత్‌బ్రష్ కంటే చాలా భిన్నమైంది. దీంట్లోని కెమెరా స్కానింగ్ చేస్తూ, నోట్లో దంతాలను శుభ్రం చేయటం (డెంటల్ ఫ్లాసింగ్) ఈ టూత్‌బ్రష్ ప్రత్యేకత. వినూత్నమైన వాక్యూమ్ క్లీనర్లు, బ్లేడ్లెస్ ఫ్యాన్ల తయారీకి పేరొందిన ‘డైసన్’ సంస్థ 499 డాలర్ల (రూ.47 వేలు)తో దీనిని తీసుకొచ్చింది. ‘కెమెరాజెట్’ అనే టూత్‌బ్రష్‌ను కంపెనీ వ్యవస్థాపకుడు జేమ్స్ డైసన్ మంగళవారం పారిస్ మార్కెట్లో విడుదల చేశారు.
ఏఐ టెక్నాలజీ, మెషిన్ లెర్నింగ్‌తో ఇది పనిచేస్తుంది. బ్రష్ హెడ్ భాగంలో 100కే పిక్సెల్ మాక్రోలెన్స్ కెమెరాను ఉపయోగించారు. దంతాల మధ్య సందులను గుర్తిస్తూ, అక్కడ మౌత్‌వాష్ చేస్తుంది. మార్కెట్లో లభించే ఇతర ఎలక్ట్రిక్ టూత్‌బ్రష్‌ల కంటే ఈ పరికరం 69శాతం ఎక్కువగా దంతాలను శుభ్రం చేసినట్టు కంపెనీ పేర్కొన్నది.