న్యూఢిల్లీ, సెప్టెంబర్ 25: గడచిన నాలుగేండ్లలో(2022-26 మధ్య) పార్లమెంట్ లేదా రాష్ట్ర శాసనసభలకు జరిగిన ఎన్నికల్లో గెలిచిన తర్వాత 111 మంది ఎంపీలు, ఎమ్మెల్యేలు పార్టీలు మారారని అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్(ఏడీఆర్) నివేదిక పేర్కొంది. 26 మంది లోక్‌సభ సభ్యులు, ఏడుగురు రాజ్యసభ సభ్యులు, 78 మంది ఎమ్మెల్యేలు పార్టీలు మారినట్టు గణాంకాలు పేర్కొన్నాయి. ఇందులో వ్యక్తిగత పార్టీ మార్పులు, పార్టీ విలీనాలు, రాజీనామా అనంతరం ఉప ఎన్నికల్లో విజయం సాధించడం, అలాగే అనర్హత వేటు పడిన తర్వాత ఉప ఎన్నికల్లో గెలవడం వంటి అంశాలు ఉన్నాయి.
అధికారంలో ఉన్న నేషనలిస్ట్ డెమోక్రటిక్ ప్రోగ్రెసివ్ పార్టీ(ఎన్డీపీపీ), నాగా పీపుల్స్ ఫ్రంట్(ఎన్పీఎఫ్) మధ్య జరిగిన రాజకీయ పునరేకీకరణకు ప్రధానంగా ముడిపడి ఉన్న ఎమ్మెల్యేలకే చెందిన 32 కేసులతో నాగాలాండ్ ఈ జాబితాలో అగ్రస్థానంలో నిలిచింది. అత్యధిక సంఖ్యలో కేసులు పశ్చిమ బెంగాల్లో నమోదయ్యాయి. ఎన్పీఎఫ్, బీజేపీ, ఎన్సీపీఐ కలిసి మొత్తం 111 మంది ఫిరాయింపుదారులలో 81 మందిని తమలో కలుపుకున్నాయి. ఇది సుమారు 73 శాతానికి సమానం. నాగాలాండ్, పశ్చిమ బెంగాల్‌తో పాటు తెలంగాణలోనూ తొమ్మిది కేసులు నమోదయ్యాయి. ఇందులో మొదట భారత రాష్ట్ర సమితి(బీఆర్ఎస్) అభ్యర్థులుగా ఎన్నికైన ఎమ్మెల్యేలే పార్టీ మారగా కాంగ్రెస్ ప్రధాన లబ్ధిదారుగా నిలిచింది.
గోవాలో 8 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు బీజేపీలో చేరగా, పంజాబ్‌లో కూడా ఆప్‌కు చెందిన 8 మంది పార్టీ మారారు. మహారాష్ట్రలో 6 కేసులు నమోదయ్యాయి. వీరంతా మొదట శివసేన(యూబీటీ) అభ్యర్థులుగా లోక్‌సభకు ఎన్నికై ఆ తర్వాత ఏక్నాథ్ షిండే నేతృత్వంలోని శివసేనలో చేరిన ఎంపీలే. మేఘాలయాలో 6, మణిపూర్‌లో 5 ఎమ్మెల్యే కేసులు నమోదు కాగా అరుణాచల్ ప్రదేశ్, గుజరాత్లో నాలుగేసి చొప్పున కేసులు నమోదయ్యాయి. హిమాచల్ ప్రదేశ్, రాజస్థాన్‌లో రెండేసి కేసులు ఉండగా కర్ణాటక, మధ్యప్రదేశ్, సిక్కిం, ఉత్తర్ ప్రదేశ్‌లో ఒక్కో కేసు నమోదైంది. ఢిల్లీలో ఒక రాజ్యసభ సభ్యుడు పార్టీ మారారు. ముఖ్యంగా పశ్చిమ బెంగాల్లో పార్టీ మారిన ఆ 20 మంది ఎంపీలు మొదట తృణమూల్ కాంగ్రెస్ అభ్యర్థులుగా ఎన్నికై ఆ తర్వాత నేషనలిస్ట్ సిటిజన్స్ పార్టీ ఆఫ్ ఇండియా(ఎన్సీపీఐ)లో చేరారు. ఇది వ్యక్తిగత ఫిరాయింపు కాదని, పార్టీ విలీనమని ఆ ఎంపీలు పేర్కొన్నారు.