‘పుట్టుక నీది.. చావు నీది.. బ్రతుకంతా దేశానిది
కాళోజీ అమరవాక్కులను తన జీవితాంతం అక్షరాలా నిజం చేస్తూ, మట్టి మనుషుల సంక్షేమమే శ్వాసగా, రైతన్నల హక్కుల పోరాటమే ధ్యేయంగా జీవించిన నిఖార్సయిన రైతు ఉద్యమ నేత సారంపల్లి మల్లారెడ్డి. 1939 ఆగస్టు 25న జన్మించిన ఆయన, గత నెల 24న 88 ఏండ్ల వయసులో తుదిశ్వాస విడిచారు. సరిగ్గా తన జన్మదినానికి ఒక్కరోజు ముందే ఆయన అమరత్వం పొందడం విషాదకరం.
నిఖార్సయిన రైతు నేత ‘సారంపల్లి’ -కాళోజీ నారాయణరావు.
కాళోజీ అమరవాక్కులను తన జీవితాంతం అక్షరాలా నిజం చేస్తూ, మట్టి మనుషుల సంక్షేమమే శ్వాసగా, రైతన్నల హక్కుల పోరాటమే ధ్యేయంగా జీవించిన నిఖార్సయిన రైతు ఉద్యమ నేత సారంపల్లి మల్లారెడ్డి. 1939 ఆగస్టు 25న జన్మించిన ఆయన, గత నెల 24న 88 ఏండ్ల వయసులో తుదిశ్వాస విడిచారు. సరిగ్గా తన జన్మదినానికి ఒక్కరోజు ముందే ఆయన అమరత్వం పొందడం విషాదకరం. సారంపల్లి మరణం అటు సీపీఎంకు, ఇటు ఉమ్మడి తెలుగు రాష్ర్టాల రైతులకు ఇది తీరని లోటు. అయిదున్నర దశాబ్దాల సుదీర్ఘ ఉద్యమ ప్రస్థానం ఆయనది. వరంగల్ జిల్లా నర్సంపేట మండలం తిమ్మంపేట గ్రామానికి చెందిన కృష్ణారెడ్డి, రాధమ్మ దంపతులకు మల్లారెడ్డి జన్మించారు. మొదట పోలీస్ పటేల్‌గా పనిచేసినా, చిన్నతనం నుంచే వామపక్ష సిద్ధాంతాలకు ఆకర్షితులయ్యారు. విలువలతో సాగిన కమ్యూనిస్టు ఆయన. రైతు పక్షాన నిలబడేందుకు తన పోలీస్ పటేల్ ఉద్యోగానికి రాజీనామా చేసి పూర్తిస్థాయి ప్రజా ఉద్యమాల్లోకి దిగారు. 1971లో ప్రభుత్వ నిరంకుశ చర్యలను ఎదుర్కొని జైలు జీవితం గడిపారు. 1981లో సర్పంచ్‌గా, కోఆపరేటివ్ సొసైటీ ఛైర్మన్‌గా, డీసీసీబీ డైరెక్టర్‌గా, రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షుడిగా, ఏఐకేఎస్ జాతీయ ఉపాధ్యక్షుడిగా ఆయన ఎదిగారు.
రైతు సమస్యలపై విశ్లేషించేటప్పుడు
మల్లారెడ్డితో సంప్రదించి సలహాలు తీసుకునే వాళ్లమని ప్రొఫెసర్ నాగేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి వంటివారు చెప్పారంటే రైతు సమస్యలపై ఆయనకు ఎంత లోతైన అవగాహన ఉండేదో అర్థం చేసుకోవచ్చు. ఆయనకు రైతు క్షేత్రంపై అపారమైన అవగాహన ఉండేది. శాస్త్రవేత్తలకే ఆయన సలహాలు చెప్పగలిగే వారంటే అతిశయోక్తి కాదు.
ఉమ్మడి తెలుగు రాష్ర్టాల్లోని ప్రతి మండలంలో ఉన్న భూసారం, నీటి వనరులు, సాగునీటి ప్రాజెక్టులు, భూమి హక్కులు, భూ నిర్వాసితుల బాధలపై మల్లారెడ్డికి లోతైన అవగాహన ఉండేవి. ఏకే గోపాలన్, మద్దికాయల ఓంకార్, భీమిరెడ్డి నరసింహారెడ్డి వంటి కమ్యూనిస్టు దిగ్గజాలతో కలిసి ఆయన పనిచేశారు. భూసారం దెబ్బతినకుండా తీసుకోవలసిన జాగ్రత్తలపై, పౌరసరఫరాల శాఖ పనితీరు మెరుగుపరచడానికి, ప్రాసెసింగ్ యూనిట్లు పెట్టాలని పాలకులకు ఎన్నోసార్లు ప్రత్యక్షంగా, అఖిలపక్ష సమావేశాల ద్వారా, మీడియా ద్వారా సూచనలు చేసేవారు. వ్యవసాయ శాస్త్రవేత్తలకు దిశానిర్దేశం చేయగలిగే జ్ఞాన సముద్రం ఆయన. ఎం.ఎస్. స్వామినాథన్ వంటి అంతర్జాతీయ స్థాయి వ్యవసాయ శాస్త్రవేత్తలకు సైతం క్షేత్రస్థాయి పరిశీలనలు, స్వీయ అనుభవాల ఆధారంగా సాగు సూచనలు, సలహాలు అందించిన ఘనత ఆయనది.
ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు రైతు చట్టాలు రూపొందించేటప్పుడు, విధాన నిర్ణయాలు తీసుకునేటప్పుడు మల్లారెడ్డి సలహాలు, సూచనలు తీసుకునేవారు. పంటలకు సోకే చీడపీడలు, సస్యరక్షణ చర్యలు, దిగుబడి, ఎగుమతులు-దిగుమతులు, మద్దతు ధరల గణాంకాలేవైనా ఆయన పెదాలపై సిద్ధంగా ఉండేవి.
ఎంత ఎత్తుకు ఎదిగినా ఆయన జీవనశైలి సాధారణంగానే ఉండేది. హైదరాబాద్‌లో ఒక చిన్న అద్దె ఇంట్లో నివాసముంటూ, నిత్యం ఆటోలు, ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణిస్తూ సాధారణ ప్రయాణికుడిలా సంచరించేవారు. రైతు సంక్షేమం, వ్యవసాయరంగ సమస్యలపై ఆయన రాసిన 20 పుస్తకాలు నేటికీ సాగు రంగానికి దిక్సూచిగా నిలుస్తున్నాయి. రైతుల ప్రయోజనాల కోసం ఏ అఖిలపక్ష పోరాటానికైనా ముందుండి నాయకత్వం వహించేవారు. మల్లారెడ్డికి భార్య భాగ్యలక్ష్మి, కుమారులు వాసుదేవరెడ్డి, మధుసూదన్‌రెడ్డి, కుమార్తె అజిత ఉన్నారు. వారి మరో కుమార్తె అనిత ఇటీవలే మరణించారు. ఆయన తన జీవితాన్ని మాత్రమే కాదు, మరణానంతరం తన పార్థ్దివదేహాన్ని కూడా సమాజ శ్రేయస్సుకే అంకితం చేయాలని, తన భౌతికకాయాన్ని గాంధీ వైద్య కళాశాల పరిశోధనల కోసం అప్పగించాలని ముందే నిర్ణయించడం ఆయన సమున్నత వ్యక్తిత్వానికి నిదర్శనం. సారంపల్లి మల్లారెడ్డి ఇప్పుడు భౌతికంగా మన మధ్య లేకపోయినా, ఆయన రూపకల్పన చేసిన రైతు ఉద్యమాలు, అందించిన జ్ఞానం ఎల్లప్పుడూ తెలుగు రైతులకు మార్గదర్శకంగా నిలుస్తాయి.
(వ్యాసకర్త: న్యాయవాది)
మల్లు కపోతంరెడ్డి
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

