తిరువనంతపురం: మలయాళం ఫిల్మ్ ఇండస్ట్రీలో మహిళా నటీమణులకు వేధింపులు ఎక్కువగా ఉన్నట్లు ఇటీవల హేమా కమీషన్ తన రిపోర్టులో పేర్కొన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో దక్షిణాది నటి రాధికా శరత్‌కుమార్(Radhika Sarathkumar) ఇవాళ సంచలన ఆరోపణలు చేశారు. మలయాళం ఫిల్మ్ షూటింగ్ సెట్ వద్ద ఉన్న కారవాన్‌లో సీక్రెట్ కెమెరాలతో మహిళా నటీమణుల వీడియోలను రికార్డు చేసినట్లు రాధిక ఆరోపించారు. ఆ వీడియోలను పురుష నటులు తమ మొబైల్ ఫోన్లలో చూసినట్లు నటి రాధిక తెలిపారు. జస్టిస్ కే హేమా కమిటీ రిపోర్టు నేపథ్యంలో మలయాళం ఛానల్‌కు నటి రాధిక ఇంటర్వ్యూ ఇచ్చారు.
హేమా కమిటీ రిపోర్టును ఎందుకు జాప్యం చేశారని ఆమె ఆశ్చర్యాన్ని వ్యక్తం చేశారు. కేవలం మలయాళం చిత్ర పరిశ్రమలోనే కాకుండా, మహిళలను వేధించడం అన్ని ఇండస్ట్రీల్లో ఉన్నట్లు ఆమె ఆరోపించారు. తనకు వ్యక్తిగతంగా ఎదురైన అనుభవాలను రాధిక ఆ ఛానల్‌కు తెలిపింది. కారవాన్లలో రహస్య కెమెరాల ద్వారా హీరోయిన్ల వీడియోలను తీసి, వాటిని చూసే నటులను తాను గమనించినట్లు రాధిక వెల్లడించారు.
కారవాన్లలో మహిళలు దుస్తులు మార్చుకునే వీడియోలను తాను చూసినట్లు చెప్పారు. అయితే ఏ చిత్రం షూటింగ్ సమయంలో ఆ ఘటన జరిగిందో, ఏ నటులు ఆ వీడియోలు చూశారన్న అంశాన్ని మాత్రం రాధిక వెల్లడించలేదు. సీక్రెట్ కెమెరాల విషయంలో కారవాన్ల ఇంచార్జీలకు గతంలో వార్నింగ్ కూడా ఇచ్చినట్లు ఆమె గుర్తు చేశారు.