Punjab Government : ఢిల్లీ (Delhi) లో అధికారం కోల్పోయిన ఆమ్ ఆద్మీ పార్టీ (Aam Aadmi party) కి పంజాబ్ (Punjab) లో కూడా షాక్ తగులబోతోందా..? పంజాబ్‌లో భగవంత్‌సింగ్ మాన్ (Bhagavanth Singh Mann) నేతృత్వంలోని ఆప్ (AAP) సర్కారు కూలిపోబోతోందా..? పంజాబ్ ప్రభుత్వాన్ని కూల్చేందుకు బీజేపీ కుట్రలు చేస్తోందా..? ప్రతిపక్ష కాంగ్రెస్‌తోనూ 32 మంది ఆప్ ఎమ్మెల్యేలు టచ్‌లో ఉన్నారా..? పంజాబ్‌లో ప్రతిపక్ష నాయకుడు, కాంగ్రెస్ నేత ప్రతాప్ సింగ్ బజ్వా (Pratap Singh Bajwa) మాటలను బట్టిచూస్తే పై ప్రశ్నలన్నింటికీ ఔననే సమాధానం వస్తోంది.
అధికార ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన 32 మంది ఎమ్మెల్యేలు తమతో టచ్‌లో ఉన్నారని బజ్వా చెబుతున్నారు. మిగతా ఎమ్మెల్యేల్లో కూడా చాలా మంది బీజేపీతో టచ్‌లో ఉండే అవకాశం ఉందని ఆయన అనుమానం వ్యక్తం చేశారు. దీన్నిబట్టి పంజాబ్‌లో ఆప్ సర్కారు కూలిపోబోతోందనే విషయం స్పష్టమవుతోందన్నారు. అయితే ఆప్ ప్రభుత్వం కూలిపోతే అందుకు కాంగ్రెస్ పార్టీది బాధ్యత కాదని, ఎందుకంటే ప్రభుత్వాన్ని కూల్చబోతున్నది బీజేపీ అని వ్యాఖ్యానించారు.
తమతో కేవలం ఆప్ ఎమ్మెల్యేలు మాత్రమే కాదని, మంత్రులు, బడా నాయకులు కూడా టచ్‌లో ఉన్నారని బజ్వా తెలిపారు. కానీ ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రభుత్వాన్ని అస్థిరపర్చాలనేది తమ ఉద్దేశం కాదని చెప్పారు. ప్రభుత్వాన్ని అస్థిరపర్చేది బీజేపీ అని ఆరోపించారు. ఆప్ సర్కారు పూర్తిగా ఐదేళ్లు పని చేయాలని తాము కోరుకుంటున్నామని, అప్పుడే తాము ఎంత చెత్త ప్రభుత్వాన్ని ఎన్నుకున్నామనే విషయం ప్రజలకు అర్థమవుతుందని వ్యాఖ్యానించారు.
పంజాబ్ ప్రభుత్వానికి చెందిన వేల కోట్ల రూపాయలు హవాలా మార్గం ద్వారా ఆస్ట్రేలియాకు, ఇతర దేశాలకు తరలిపోయాయని, దీనిపై పలువురు ఆప్ నేతలే నిరుత్సాహంతో ఉన్నారనే విషయం వాస్తవమని బజ్వా చెప్పారు. ఢిల్లీ మోడల్ అంటే లూటీలో నిపుణులను తయారు చేయడమేనని అన్నారు. అయితే బజ్వా వ్యాఖ్యలను ఆప్ తిప్పికొట్టింది. ఆయన బెంగళూరులో బీజేపీ నేతలతో సమావేశమయ్యారని, ఇప్పటికే ఆయన బీజేపీ నుంచి టికెట్ ఖాయం చేసుకున్నాడని ఆరోపించింది.