అమృత్సర్, మే 18: భారత్‌మాల ప్రాజెక్ట్ కింద భూములు కోల్పోయిన వేలాది మంది పంజాబ్ రైతులు గురువారం రైల్వే ట్రాక్‌పై పెద్ద ఎత్తున నిరసనకు దిగారు. దేవిదాస్‌పురా వద్ద రైళ్ల రాకపోకల్ని అడ్డుకున్నారు. దీంతో గురువారం మధ్యాహ్నం నుంచి రైల్వే ట్రాఫిక్ స్తంభించిపోయింది. అమృత్సర్ నుంచి ఢిల్లీ వెళ్లాల్సిన రైళ్లను వేరే మార్గంలోకి మరలించాల్సి వచ్చిందని రైల్వే అధికారులు తెలిపారు. తమకు ఇస్తున్న భూపరిహారం సరిపోదని ప్రాజెక్ట్ భూసేకరణలో భూములు కోల్పోయిన రైతులు గత కొన్నేండ్లుగా ఆందోళన చేస్తున్నారు. న్యాయమైన డిమాండ్ల కోసం గురుదాస్పురాలో నిరసనకు దిగిన మహిళా రైతులపై పోలీసులు చేయి చేసుకున్నారని ఆరోపించారు. తమ డిమాండ్లను నెరవేర్చేవరకు రైల్వే ట్రాక్‌లపై రైతుల నిరసనలు కొనసాగుతాయని ప్రభుత్వాన్ని హెచ్చరించారు.