న్యూఢిల్లీ : పంజాబ్ మాజీ ముఖ్యమంత్రి కెప్టెన్ అమరీందర్ సింగ్ సోమవారం బీజేపీ పార్టీలో చేరారు. అలాగే ఆయన పార్టీ పంజాబ్ లోక్ కాంగ్రెస్‌ను కాషాయ పార్టీలో విలీనం చేశారు. ఢిల్లీలో జరిగిన కార్యక్రమంలో కేంద్రమంత్రి కిరణ్ రిజీజు బీజేపీ కండువా కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించగా.. మరో కేంద్రమంత్రి నరేంద్ర తోమర్ సభ్యత్వాన్ని అందజేశారు. అంతకు ముందు అమరీందర్.. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో భేటీ అయ్యారు.
ఇదిలా ఉండగా.. పంజాబ్ ఎన్నికలకు ముందు అమరీందర్ సింగ్ కాంగ్రెస్‌ను వీడి.. కొత్త రాజకీయ పార్టీని స్థాపించారు. అయితే, అమరీందర్ భార్య ప్రణీత్ కౌర్ పాటియాల ఎంపీగా గెలుపొందగా.. ఆమె కాంగ్రెస్‌లోనే కొనసాగనున్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో కెప్టెన్ కాంగ్రెస్‌ను వీడి.. ‘పంజాబ్ లోక్ కాంగ్రెస్’ పేరుతో వేరు కుంపటి పెట్టుకున్నారు. అప్పట్లో ఆయన తనయుడు రణిందర్ సింగ్ బీజేపీతో సమన్వయం చేసుకుంటూ టికెట్ల పంపిణీలో కీలక పాత్ర పోషించారు. అయితే, పంజాబ్‌లో ఆప్ ప్రభంజనం ముందు కాంగ్రెస్, బీజేపీ సహా ఏ పార్టీ నిలువలేకపోయాయి.
ప్రస్తుతం పంజాబ్‌లో పార్టీని పటిష్టం చేసేందుకు బీజేపీ ప్రయత్నిస్తున్నది. ఈ క్రమంలోనే బలమైన సిక్కు నేత కోసం వెతుకున్నది. మాజీ సీఎం అమరీందర్‌కు ప్రధాని మోదీకి వ్యక్తిగతంగా మంచి సంబంధాలున్నాయి. అమరీందర్ కాంగ్రెస్ నుంచి రెండుసార్లు పంజాబ్ ముఖ్యమంత్రిగా పనిచేశారు. తాజాగా ఆయన బీజేపీలో చేరడంతో ఆయన పాత్రేంటి అన్నది ప్రశ్నార్థకంగా మారింది. ప్రస్తుతం ఆయన వయసు 80 సంవత్సరాలు. 75 సంవత్సరాలు పైబడిన నేతలకు బీజేపీ టికెట్లు ఇవ్వని విషయం తెలిసిందే. ఇలాంటి పరిస్థితుల్లో బీజేపీలో ఆయన పాత్ర ఏంటన్నది తెలియాల్సి ఉన్నది.