చండీగఢ్, మార్చి 23: ఆమ్ ఆద్మీ పార్టీ నేతృత్వంలోని పంజాబ్ ప్రభుత్వం అమలు చేస్తున్న మద్యం పాలసీపై విచారణ జరిపించాలని ఆ రాష్ట్ర బీజేపీ శాఖ కేంద్ర ఎన్నికల సంఘాన్ని కోరింది. ఢిల్లీ మద్యం పాలసీ తరహాలోనే పంజాబ్ విధానాన్ని రూపొందించారని తెలిపింది. పంజాబ్ ఎక్సైజ్ పాలసీపై ఈడీ దర్యాప్తునకు ఆదేశించాలని విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు పంజాబ్ బీజేపీ చీఫ్ సునీల్ జాఖర్ ఆధ్వర్యంలోని ఓ ప్రతినిధి బృందం శనివారం రాష్ట్ర ఎన్నికల అధికారికి మెమోరాండం సమర్పించింది. మే 2022లో పంజాబ్ ఎక్సైజ్ పాలసీని రూపొందించారని జాఖర్ తెలిపారు. ఇందుకు సంబంధించి ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ కేసులో అరెస్టయిన అప్పటి ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియాతో జరిగిన సమావేశానికి పంజాబ్ ఆర్థిక మంత్రి హర్పాల్ సింగ్ చీమాతో పాటు ఇద్దరు సీనియర్ అధికారులు హాజరయ్యారని జాఖర్ ఆరోపించారు. భగవంత్ మాన్ ప్రభుత్వం పంజాబ్ వనరులను అధికారికంగా కొల్లగొట్టిందని ఆరోపించారు. దీనివల్ల రాష్ట్రం సుమారు వెయ్యి కోట్ల ఆదాయాన్ని కోల్పోయిందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. అయితే రాష్ట్ర ఎక్సైజ్ పాలసీ కారణంగా ఏడాదిలో ప్రభుత్వ ఆదాయం రూ.6 వేల కోట్ల నుంచి ఏకంగా రూ.10 వేల కోట్లకు పెరిగిందని జఖర్పై ఆప్ పంజాబ్ యూనిట్ ముఖ్య అధికార ప్రతినిధి మల్విందర్ కాంగ్ మండిపడ్డారు.