Punjab Assembly : పంజాబ్లో భగవంత్ మాన్ నేతృత్వంలోని ఆమ్ ఆద్మీ పార్టీ సర్కారుకు సొంత పార్టీ ఎమ్మెల్యేల నుంచే నిరసన సెగ తగిలింది. ఇవాళ అసెంబ్లీ సాక్షిగా ఇద్దరు ఆప్ ఎమ్మెల్యేలు ప్రభుత్వ పనితీరుపై అసంతృప్తి గళం వినిపించారు. ఆరోగ్య రంగంలో సర్కారు పనితీరు అధ్వాన్నంగా ఉందని విమర్శించారు. తన నియోజకవర్గంలో ప్రజలు పాకిస్థాన్లో ఉన్నట్టుగా ఫీలవుతున్నారని మోగా జిల్లాలోని ధరమ్కోట్ నియోజకవర్గ ఎమ్మెల్యే దేవిందర్ జీత్ సింగ్ వ్యాఖ్యానించారు.
ధరమ్కోట్లోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆధునీకరణకు సంబంధించి ఏదైనా ప్రతిపాదన ఉందా..? అని దేవిందర్జీత్ సింగ్ అసెంబ్లీలో అడిగిన ప్రశ్నకు ఆరోగ్య మంత్రి బల్బీర్ సింగ్ లేదని సమాధానమిచ్చారు. ధరమ్కోట్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సబ్ డివిజనల్ ఆస్పత్రిగా మార్చే ప్రతిపాదనేది ప్రస్తుతం ప్రభుత్వం వద్దని లేదని చెప్పారు. కోట్ ఇసే ఖాన్లోని కమ్యూనిటీ హెల్త్ సెంటర్కు కేవలం 8 కిలోమీటర్ల దూరంలోనే ధరమ్కోట్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఉన్నందున అప్గ్రేడ్ చేయడంలేదని వివరణ ఇచ్చారు.
ధరమ్కోట్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ట్రామా కేర్ సెంటర్ను ప్రారంభించాలనే ప్రతిపాదన కూడా సర్కారు వద్ద లేదని మంత్రి చెప్పారు. రాష్ట్రంలో ఇప్పటికే జలంధర్, పఠాన్కోట్, ఖన్నా, ఫిరోజ్పూర్, ఫజిల్కాల్లో ట్రామా కేర్ సెంటర్లు ఉన్నాయని అన్నారు. దాంతో మోగా జిల్లాపైన, తన నియోజకవర్గంపైన ప్రభుత్వం సవతితల్లి ప్రేమ చూపుతోందని ఎమ్మెల్యే దేవిందర్జీత్ సింగ్ వ్యాఖ్యానించారు. షుట్రానా నియోజకవర్గ ఎమ్మెల్యే కుల్వంత్ సింగ్ బాజీగర్ కూడా ఆరోగ్య రంగంలో ప్రభుత్వ తీరుపై అసంతృప్తి గళం వినిపించారు.