చండీగఢ్: పంజాబ్ గవర్నర్ భన్వరీలాల్ పురోహిత్ తీరుపై ఆ రాష్ట్రంలో అధికారంలో ఉన్న ఆమ్ ఆద్మీ పార్టీ అసంతృప్తి వ్యక్తంచేసింది. పంజాబ్ ప్రజలు తమకు అధికారం కట్టబెట్టారని, గవర్నర్ పురోహిత్ మేం ఏ పని చేసినా అడ్డు తగలడం కరెక్టు కాదని ఆ రాష్ట్ర ఆర్థిక మంత్రి హెచ్ఎస్ చీమా వ్యాఖ్యానించారు. గవర్నర్ గారు బీజేపీ కోసం పనిచేయడం మానుకొని, రాజ్యాంగపరమైన బాధ్యతలు నెరవేర్చాలని చీమా సూచించారు.
చండీగఢ్‌లోని పంజాబ్ అగ్రికల్చరల్ యూనివర్సిటీ నూతన వీసీ సత్బీర్ సింగ్ ఆర్థిక మంత్రి చీమాను మర్యాదపూర్వకంగా కలిసిన సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఇటీవల పంజాబ్ అగ్రికల్చరల్ యూనివర్సిటీ వీసీగా సత్బీర్ సింగ్‌ను నియమించడాన్ని గవర్నర్ పురోహిత్ తప్పుపట్టారు. యూజీసీ నియామావళికి విరుద్ధంగా నియామకం జరిగిందని ఆరోపించారు.
యూజీసీ నిబంధనలు పాటించకుండా, యూనివర్సిటీ ఛాన్సెలర్ అయిన తనకు మాట మాత్రమైనా చెప్పకుండా వైస్ ఛాన్సెలర్‌ను నియమించడం అక్రమమని గవర్నర్ విమర్శించారు. సత్బీర్ను వెంటనే పదవి నుంచి తొలగించాలని కోరుతూ పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్కు లేఖ రాశారు. ఈ నేపథ్యంలో ఇవాళ ఆర్థికమంత్రి చీమా చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.