పుణె: పుణె కారు యాక్సిడెంట్ కేసులో నిందిత మైనర్ బాలుడిని విడుదల చేయడంలో జువెనైల్ జస్టిస్ బోర్డ్ (జేజేబీ) పరస్పర విరుద్ధంగా వ్యవహరించినట్లు వెల్లడైంది. ఈ మేరకు విచారణ కమిటీ సామాజిక న్యాయ శాఖకు 100 పేజీల నివేదిక సమర్పించింది. విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు.. బాలుడికి జేజేబీ నాన్ జ్యుడిషియల్ సభ్యుడు ఎల్ఎన్ దన్వడే బెయిల్ మంజూరు చేశారు. రోడ్డు భద్రతపై 300 పదాలతో వ్యాసం రాయాలని, రూ.15 వేల పూచీకత్తు సమర్పించాలని ఆదేశించారు. ప్రమాదం జరిగిన 15 గంటల్లోనే ఈ తీర్పు చెప్పి నిందితుడిని వదిలిపెట్టారు. రక్త నివేదికలోని లోపాలను దన్వడే పరిశీలించలేదని నివేదిక చెప్పింది. నిబంధనల ప్రకారం రోస్టర్ను తయారు చేయకుండా తీర్పు ప్రకటించారని తెలిపింది. జేజేబీ సభ్యులు హాజరు కాకపోయినప్పటికీ, దన్వడే ఒక్కరే విచారణ జరిపి, బాలుడిని విడుదల చేసినట్టు వివరించింది. లోపాలు స్పష్టంగా కనిపిస్తున్నందున మర్నాడే దన్వడే తీర్పును జేజేబీ ధర్మాసనం రద్దు చేసి ఉండాల్సిందని తెలిపింది. జేజేబీ సభ్యులందరికీ షోకాజ్ నోటీసులను ఇచ్చినట్లు తెలిపింది.