ముంబై: తనను తాను దైవ పురుషుడిగా చెప్పుకున్న బాబా ఒక మహిళను చాలా ఏళ్లుగా లైంగికంగా వేధించాడు. భర్త, కుటుంబం నుంచి ఆమెను వేరు చేశాడు. ఆ మహిళతో తన మూత్రాన్ని తాగించాడు. అలాగే ఆమెతో చోరీలు కూడా చేయించాడు. (Pune Godman Abused Woman) బాధితురాలి ఫిర్యాదుతో బాబా, అతడి అనుచరులను పోలీసులు అరెస్ట్ చేశారు. మహారాష్ట్రలోని పూణే జిల్లాలో ఈ సంఘటన జరిగింది. రాధేశ్యామ్ మిశ్రా అలియాస్ రాధామోహన్ మిశ్రా తనను తాను దేవుడి అవతారంగా చెప్పుకుని ప్రాచుర్యం పొందాడు. పూణే వాఘోలిలోని ఉబాలే నగర్ ప్రాంతంలో ‘ఆధునిక గురుకులం’ పేరుతో ఆశ్రమం నిర్వహిస్తున్నాడు. చాలా కాలంగా పలువురు భక్తులను మోసం చేస్తున్నాడు.
కాగా, 2010లో ఒక మహిళ ఆ ఆశ్రమాన్ని సందర్శించింది. రాధేశ్యామ్ మిశ్రా తనను తాను దైవ పురుషుడిగా ఆమెను నమ్మించాడు. ఆ మహిళను ఆమె కుటుంబానికి దూరం చేశాడు. భర్తకు విడాకులు ఇచ్చేలా ఒత్తిడి చేశాడు. 2010 నుంచి 2016 వరకు ఆ మహిళను లైంగికంగా వేధించాడు. ఆమెను శారీరకంగా హింసించాడు. విద్యుత్ షాక్‌లు ఇచ్చాడు. ఆ మహిళ అశ్లీల వీడియోలు రికార్డ్ చేశాడు. వాటితో ఆమెను బ్లాక్మెయిల్ చేశాడు. తన పలుకుబడి, శక్తుల పేరుతో ఆమె కుటుంబాన్ని కూడా భయపెట్టాడు.
మరోవైపు తనను తాను దేవుడి పునర్జన్మగా రాధేశ్యామ్ మిశ్రా ఆ మహిళను నమ్మించాడు. తన మూత్రాన్ని తాగమని ఆమెను బలవంతం చేశాడు. ఆశ్రమానికి నిధుల కోసం ఆ మహిళను బెదిరించి, బ్లాక్మెయిల్ చేసి దొంగతనాలు కూడా చేయించాడు. బాబా ఆగడాలు భరించలేని ఆ మహిళ తాజాగా పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ నేపథ్యంలో మిశ్రా ఆశ్రమంపై పోలీసులు దాడి చేశారు. రహస్య భూగర్భ గది నుంచి అభ్యంతరకర వస్తువులను స్వాధీనం చేసుకున్నారు.
కాగా, 12 ల్యాప్‌టాప్‌లు, 11 మొబైల్ ఫోన్లు, 19 హార్డ్ డ్రైవ్‌లు, పెన్ డ్రైవ్‌లు, క్యాసెట్లతో పాటు రూ. 6.5 లక్షల నగదు, రూ. 15 లక్షల విలువైన ఆభరణాలు, పెద్ద మొత్తంలో వైద్య మాత్రలు, మత్తుపదార్థాలు ఆ రహస్య గదిలో లభించాయి. బాబా మిశ్రా, సన్నిహితుడు ‘స్వామి’ కన్వల్ నయన్‌తో సహా ఏడుగురు అనుచరులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఎనిమిది మంది నిందితులను కోర్టులో హాజరుపరచగా శనివారం వరకు పోలీస్ కస్టడీకి వారిని అప్పగించారు. బాబా మిశ్రా అకృత్యాలపై మరింతగా దర్యాప్తు చేస్తున్నట్లు పోలీస్ అధికారి తెలిపారు. మరింత మంది బాధితులు ముందుకు వచ్చే అవకాశం ఉన్నదని అన్నారు.