Pune accident case : మహారాష్ట్రలోని పుణె సిటీలో జరిగిన పోర్షే కారు ప్రమాదం కేసులో మైనర్ నిందితుడి తండ్రి, తాతకు జిల్లా కోర్టు 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ విధించింది. మద్యం మత్తులో నిర్లక్ష్యంగా కారు నడిపి ఇద్దరు టెకీల మరణానికి కారణమైన మైనర్ బాలుడి తండ్రి విశాల్ అగర్వాల్, తాత సురేంద్ర అగర్వాల్‌ను అరెస్ట్ చేసిన పోలీసులు గత మంగళవారం కోర్టులో హాజరుపర్చగా మూడు రోజుల పోలీస్ కస్టడీకి అప్పగించింది.
అయితే ఇవాళ్టితో పోలీస్ కస్టడీ ముగియడంతో నిందితులిద్దరిని మళ్లీ కోర్టులో హాజరుపర్చారు. దాంతో కోర్టు వారికి 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీ విధించింది. కాగా, ఈ నెల 19న 17 ఏళ్ల బాలుడు ఫూటుగా మద్యం సేవించి నిర్లక్ష్యంగా కారు నడుపుతూ ఓ బైకును ఢీకొట్టాడు. ఈ ఘటనలో బైకుపై వెళ్తున్న యువకుడు, యువతి అక్కడికక్కడే మరణించారు. వాళ్లిద్దరూ సాఫ్ట్వేర్ ఇంజినీర్లుగా పనిచేస్తున్నట్లు పోలీసులు దర్యాప్తులో తేలింది.
అయితే రియల్టర్ అయిన నిందితుడి తండ్రికి పలుకుబడి ఉండటంతో తన కొడుకును కేసు నుంచి తప్పించేందుకు ప్రయత్నించాడు. అందుకోసం ప్రమాదం జరిగిన సమయంలో కారు నడిపింది తన కుమారుడు కాదని, డ్రైవర్ అని కేసును తప్పుదోవ పట్టించబోయాడు. ఈ మేరకు ససూన్ ఆస్పత్రిలో తన కుమారుడి రక్త నమూనాలను మార్పించాడు. ప్రమాదం జరిగినప్పుడు నిందితుడు మద్యం మత్తులో ఉన్నట్లు సీసీ కెమెరాల్లో కనిపించినా.. బ్లడ్ రిపోర్టుల్లో మాత్రం అతను మద్యం ముట్టనట్లుగా రావడంతో విషయం బయటపడింది.
దాంతో బ్లడ్ శాంపిల్స్ మార్చిన ఇద్దరు డాక్టర్లపై పోలీసులు కేసు నమోదు చేశారు. మైనర్ తండ్రి విశాల్ అగర్వాల్‌ను అరెస్ట్ చేశారు. అదేవిధంగా తన మనుమడిని కేసు నుంచి తప్పించడం కోసం అతని తాత సురేంద్ర అగర్వాలే డ్రైవర్‌ను కేసులో ఇరికించేందుకు ప్లాన్ చేసినట్లు తేలడంతో అతడిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మరోవైపు మద్యం మత్తులో కారు నడిపి ఇద్దరి మరణానికి కారణమైన మైనర్ కూడా ప్రస్తుతం జువైనల్ హోమ్‌లో ఉన్నాడు.
మూడు రోజుల పోలీస్ కస్టడీ ముగియడంతో ఇవాళ నిందితులు విశాల్ అగర్వాల్, సురేంద్ర అగర్వాల్‌లను పోలీసులు మరోసారి పుణె జిల్లా కోర్టులో హాజరుపర్చారు. కోర్టు ఇద్దరికీ ఈసారి 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ విధించింది.