ముంబై, ఫిబ్రవరి 28 (నమస్తే తెలంగాణ): పుణెలో గత మంగళవారం బస్సులో యువతిపై లైంగికదాడికి పాల్పడిన నిందితుడు దత్తాత్రేయ రామ్‌దాస్ గడే(37)ను పోలీసులు శుక్రవారం అరెస్టు చేశారు. 500 మంది పోలీసులు, డాగ్ స్కాడ్, డ్రోన్ల నిఘాతో 70 గంటల సెర్చ్ ఆపరేషన్ తర్వాత నిందితుడిని షిరూర్ తాలూకా గుణత్ గ్రామంలోని చెరుకు తోటలో పట్టుకున్నారు. నిందితుడి వేటలో సుమారు 500 మంది గ్రామస్థులు సాయం చేసినట్టు పుణె పోలీస్ కమిషనర్ అమితేశ్ కుమార్ శుక్రవారం మీడియా సమావేశంలో వెల్లడించారు.
మంచి నీళ్ల కోసం నిందితుడు ఒక వ్యక్తి దగ్గరకు వెళ్లినప్పుడు.. ఆ వ్యక్తి పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో నిందితుడి అరెస్ట్ సులభమైంది. నిందితుడి ఆచూకీ తెలిపిన వారికి లక్ష రూపాయల నజారానాను పోలీసులు ప్రకటించారు. ఓ దవాఖానలో పని చేస్తున్న యువతి(26)ని దత్తాత్రేయ ఓ బస్‌లో రేప్ చేసిన ఘటన కలకలం రేపిన విషయం తెలిసిందే.