ముంబై: నీట్ పరీక్షకు సంబంధించిన జీవశాస్త్ర ప్రశ్నల లీకేజీకి కారణమైన బోటనీ టీచర్‌ను సీబీఐ శనివారం అరెస్ట్ చేసింది. మహారాష్ట్రలోని పూణేకు చెందిన ఆమె నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) ప్యానల్లో సభ్యురాలని సీబీఐ అధికారులు తెలిపారు. నీట్ ఎగ్జామ్ పేపర్ లీకేజీ వ్యవహారంలో ఆమె రెండో కీలక సూత్రధారిణి అని వెల్లడించారు. (NEET Paper Leak) సీబీఐ దర్యాప్తు ప్రకారం.. పూణేకు చెందిన బోటనీ ఉపాధ్యాయురాలు మనీషా గురునాథ్ మంధారే, ఎన్టీఏ ప్రశ్నపత్రాల రూపకల్పన కమిటీలో సభ్యురాలిగా ఉన్నారు. పూణేలో ఒక బ్యూటీ పార్లర్ నిర్వహిస్తున్న, నీట్ లీక్ కేసులో మే 14న అరెస్టైన మనీషా వాఘ్మారేను ఏప్రిల్‌లో ఆమె సంప్రదించింది. ఆమె ద్వారా నీట్ పరీక్ష రాయబోయే అభ్యర్థులను సమీకరించింది. పూణేలోని తన నివాసంలో ఆ విద్యార్థులకు కోచింగ్ క్లాస్‌లు నిర్వహించింది.
కాగా, ఎన్టీఏ ప్రశ్నపత్రాల రూపకల్పన కమిటీలో సభ్యురాలిగా ఉన్న బోటనీ టీచర్ మనీషా తన వద్ద కోచింగ్ తీసుకున్న అభ్యర్థులకు నీట్ పేపర్‌ను లీక్ చేసింది. బోటనీ, జువాలజీకి సంబంధించిన ప్రశ్నలను నోట్‌బుక్‌లో రాసుకోవాలని వారికి చెప్పింది. అలాగే టెక్ట్‌బుక్స్‌లో మార్క్ చేసుకోమని సూచించింది. మే 3న జరిగిన నీట్ యూజీ పరీక్షలో లీకైన ఈ బోటనీ, బయోలజీ ప్రశ్నలు అధిక శాతం సరిపోలినట్లు సీబీఐ అధికారి తెలిపారు. అరెస్ట్ చేసిన మనీషాను నీట్ పేపర్ లీక్‌పై మరింతగా ప్రశ్నిస్తామని చెప్పారు.
మరోవైపు, నీట్ పేపర్ లీక్‌లో ప్రధాన సూత్రధారి, పదవీ విరమణ పొందిన కెమిస్ట్రీ లెక్చరర్ పీవీ కులకర్ణిని సీబీఐ అధికారులు శుక్రవారం పూణేలో అరెస్టు చేశారు. ఎన్టీఏ ప్రశ్నపత్రాల రూపకల్పన కమిటీలో సభ్యుడైన ఆయన కూడా పూణేలో కోచింగ్ సెంటర్ నిర్వహిస్తున్నాడు. కోచింగ్ తీసుకున్న అభ్యర్థులకు కెమిస్ట్రీ ప్రశ్నలను లీక్ చేసినట్లు దర్యాప్తులో సీబీఐ గుర్తించింది.
అయితే నీట్ పేపర్ లీక్ కేసులో ఇప్పటి వరకు ఢిల్లీ, జైపూర్, గురుగ్రామ్, నాసిక్, పూణే, అహల్యానగర్‌కు చెందిన 9 మందిని సీబీఐ అరెస్ట్ చేసింది. దేశవ్యాప్తంగా ఆరు చోట్ల సోదాలు నిర్వహించడంతోపాటు పలు పత్రాలు, ల్యాప్‌టాప్‌లు, బ్యాంకు ఖాతాల వివరాలు, మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నది. నీట్ యూజీ ప్రశ్నపత్రాన్ని రూపొందించిన ఎన్టీఏ కమిటీలోని ఇతర సభ్యులు, సీనియర్ అధికారుల ప్రమేయంపై కూడా దర్యాప్తు చేస్తున్నట్లు సీబీఐ అధికారి తెలిపారు. దీంతో మరిన్ని అరెస్ట్‌లు జరుగవచ్చని చెప్పారు.