ISRO | న్యూఢిల్లీ, డిసెంబర్ 29: ఖగోళ పరిశోధనల్లో అద్భుత విజయాలతో సత్తా చాటుతున్న భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) మరో ప్రతిష్టాత్మక ప్రయోగానికి సిద్ధమైంది. ఎంతో కాలం నుంచి ఆసక్తిగా ఎదురు చూస్తున్న ‘స్పాడెక్స్’ ప్రయోగాన్ని మరికొన్ని గంటల్లో చేపట్టనున్నది. దీనిలో భాగంగా సోమవారం రాత్రి 9:58 గంటలకు శ్రీహరికోటలోని సతీశ్ ధావన్ స్పేస్ సెంటర్ (షార్) మొదటి లాంచ్‌ప్యాడ్ నుంచి పీఎస్ఎల్వీ (పోలార్ శాటిలైట్ లాంచ్ వెహికల్) సీ-60 రాకెట్ ద్వారా ఎస్‌డీఎక్స్-01 (ఛేజర్), ఎస్‌డీఎక్స్-02 (టార్గెట్) ఉపగ్రహాలను నింగిలోకి పంపనున్నది.
వాటిని దిగువ భూకక్ష్యలో అనుసంధానించేందుకు ప్రయత్నించనున్నది. భవిష్యత్తులో భారత్ చేపట్టే ఉపగ్రహ ప్రయోగాలు, చంద్రునిపై జరిపే పరిశోధనలతోపాటు రోదసిలో భారత అంతరిక్ష కేంద్రం అభివృద్ధికి ఎంతో కీలకమైన ఈ ప్రయోగం ఖగోళ పరిశోధనల్లో ఇస్రో సాధించిన గణనీయ పురోగతికి సూచికగా నిలువనున్నది. విజయంతో 2024 సంవత్సరానికి వీడ్కోలు పలకాలని భావిస్తున్న ఇస్రో ఈ చారిత్రక ఘట్టాన్ని ప్రత్యక్ష ప్రసారం చేయనున్నది.