PSLV-C60 | భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో).. ఆంధ్రప్రదేశ్లోని శ్రీహరి కోట నుంచి ఉపగ్రహ వాహక నౌక పీఎస్ఎల్వీ-సీ60 సోమవారం రాత్రి నింగిలోకి దూసుకెళ్లింది. రెండు చిన్న ఉపగ్రహాలను మోసుకుంటూ వెళ్లిన పీఎస్ఎల్వీ-సీ 60 ప్రయోగం భవిష్యత్ అంతరిక్ష పరిశోధనలకు కీలకం కానున్నది. స్పేస్ డాకింగ్ లక్ష్యంగా పీఎస్ఎల్వీ-సీ 60 ప్రయోగం జరిగింది. 2035 నాటికి చంద్రుడిపై సొంతంగా స్పేస్ స్టేషన్ ఏర్పాటు చేసుకోవడమే లక్ష్యంగా ఇస్రో కదులుతోంది. ఇందులో భాగంగా పీఎస్ఎల్వీ-సీ60 తాను మోసుకెళ్లిన రెండు ఉపగ్రహాలను విజయవంతంగా కక్ష్యలోకి పంపింది.స్పేస్ డాకింగ్ చేయగల సామర్థ్యం గల రెండు ఉపగ్రహాల ప్రయోగం విజయవంతమైందని ఇస్రో ప్రకటించింది.
భూ ఉపరితలం నుంచి 470 కి.మీ ఎత్తున వృత్తాకార కక్ష్యలో రెండు వ్యోమ నౌకలు స్వతంత్రంగా ఒకేసారి డాకింగ్ అయ్యేలా ఇస్రో శాస్త్రవేత్తలు ప్లాన్ చేశారు. సొంత అంతరిక్ష కేంద్రం నిర్మాణానికి వ్యోమ నౌకల డాకింగ్, అన్ డాకింగ్ టెక్నాలజీ అవసరం అని ఇస్రో వెల్లడించింది. ఈ ప్రయోగం విజయవంతమైతే స్పేస్ డాకింగ్ టెక్నాలజీ కల నాలుగో దేశంగా భారత్ నిలుస్తుంది. ఇప్పటికే అమెరికా, రష్యా, చైనాలకు ఈ టెక్నాలజీ అందుబాటులో ఉంది.