న్యూఢిల్లీ: కెనడాలో ఇటీవల వలస (ఇమ్మిగ్రేషన్) విధానాలను మార్చడంతో 70 వేల మందికిపైగా అంతర్జాతీయ గ్రాడ్యుయేట్ విద్యార్థులు ఆ దేశాన్ని వదిలి వెళ్లాల్సిన ముప్పు తలెత్తింది. వీరిలో భారత విద్యార్థులే ఎక్కువగా ఉన్నట్టు తెలుస్తున్నది. స్టడీ పర్మిట్లపై పరిమితి విధించాలని, శాశ్వత నివాస దరఖాస్తులను (పర్మినెంట్ రెసిడెన్సీ నామినేషన్లను) తగ్గించాలని జస్టిన్ ట్రుడో ప్రభుత్వం నిర్ణయించడంతో వారికి ఈ పరిస్థితి ఏర్పడింది. దీంతో కొత్త జీవితాన్ని నిర్మించుకోవాలని ఎన్నో ఆశలతో కెనడాలో అడుగు పెట్టిన భారతీయులతో సహా, విదేశీ విద్యార్థులంతా ఇప్పుడు అక్కడ నిరసనలతో హోరెత్తిస్తున్నారు. ఈ ఏడాది చివరికి చాలా మంది అంతర్జాతీయ గ్రాడ్యుయేట్ల వర్క్ పర్మిట్ల గడువు ముగియనున్నదని, దీంతో వారంతా స్వదేశాలకు తిరిగి వెళ్లిపోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని విద్యార్థుల ప్రతినిధులు చెప్పారు.