Priyanka Gandhi : ‘వన్ నేషన్, వన్ ఎలక్షన్ (One Nation, One Election bill)’ బిల్లుపై ఏర్పాటు కాబోతున్న జాయింట్ పార్లమెంటరీ కమిటీ (JPC) లో కాంగ్రెస్ పార్టీ (Congress party) జాతీయ ప్రధాన కార్యదర్శి, వాయనాడ్ ఎంపీ (Wayanad MP) ప్రియాంకాగాంధీ (Priyanka Gandhi) కి చోటు కల్పిస్తారని వార్తలు వినిపిస్తున్నాయి. ఏదైనా బిల్లును జేపీసీకి పంపినప్పుడు ఆ బిల్లుపై ప్రభుత్వం ఏర్పాటు చేసే జేపీసీలో ప్రతిపక్ష ఎంపీలకు కూడా చోటు కల్పిస్తారు.
అయితే తమ పార్టీ తరఫున ఎవరిని జేపీసీలో సభ్యులుగా చేర్చాలనే విషయంలో ప్రతిపక్ష పార్టీలే తుది నిర్ణయం తీసుకుంటాయి. ఈ క్రమంలో కాంగ్రెస్ పార్టీ.. ప్రియాంకాగాంధీ వాద్రాను వన్ నేషన్, వన్ ఎలక్షన్ బిల్లుపై ఏర్పాటు కాబోయే జేపీసీలో సభ్యురాలిగా చేరుస్తారనే ప్రచారం జరుగుతోంది. ప్రియాంకాగాంధీతోపాటు మనీష్ తివారి, సుఖ్‌దేవ్ భగత్, రణ్‌దీప్ సుర్జేవాలాకు కూడా జేపీసీలో చోటు కల్పించనున్నట్లు తెలుస్తోంది.
దేశమంతటా ఒకే దఫా ఎన్నికలు నిర్వహించాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం ఒక బిల్లును పార్లమెంట్ ముందుకు తీసుకొచ్చింది. కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జన్‌రామ్ మేఘ్వాల్ మంగళవారం బిల్లును లోక్‌సభలో ప్రవేశపెట్టారు. అనంతరం బిల్లుపై సమగ్ర అధ్యయనం కోసం జేపీసీకి పంపాలని ప్రతిపాదించారు. ఈ ప్రతిపాదనపై లోక్‌సభ ఓటింగ్ నిర్వహించి జేపీసీకి పంపాలని నిర్ణయించారు.