Priyanka Gandhi : వచ్చే జనాభా లెక్కలతోపాటే కులగణన (Caste census) చేపడుతామని కేంద్ర ప్రభుత్వం (Union Govt) ప్రకటించడాన్ని స్వాగతిస్తూనే.. కాంగ్రెస్ పార్టీ (Congress party) కీలక నాయకురాలు, వాయనాడ్ ఎంపీ (Wayanad MP) ప్రియాంకాగాంధీ (Priyanka Gandhi) కేంద్రంపై విమర్శలు గుప్పించారు. తన సోదరుడు రాహుల్‌గాంధీ ఒత్తిడి కారణంగానే కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా కులగణన చేపట్టేందుకు అంగీకరించిందని ఆమె వ్యాఖ్యానించారు.
కేరళలోని వాయనాడ్ నియోజకవర్గంలో మీడియాతో మాట్లాడుతూ ప్రియాంకాగాంధీ ఈ వ్యాఖ్యలు చేశారు. కులగణన అంశాన్ని తన సోదరుడు రాహుల్‌గాంధీ పార్లమెంట్లో లేవనెత్తారని ప్రియాంకాగాంధీ చెప్పారు. ‘కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి పెరిగింది. నా సోదరుడు గత ఏడాది ఈ అంశాన్ని ఎత్తుకున్నారు. మళ్లీమళ్లీ ఆయన కులగణన అంశాన్ని ప్రస్తావించారు. కానీ బీజేపీ నాయకులంతా ఆయన ప్రతిపాదనను తోసిపుచ్చారు. ప్రధాన మంత్రి, కేంద్ర మంత్రులు కూడా తన ప్రతిపాదనను వ్యతిరేకించారు. పార్లమెంట్లో రాహుల్‌గాంధీ ఈ అంశంపై మాట్లాడుతుంటే బీజేపీ నేతలు ఎగతాళి చేశారు.’ అని ప్రియాంకాగాంధీ గుర్తుచేశారు.
‘కులగణనకు ససేమిరా అన్ని బీజేపీ ఇప్పుడు దారికొచ్చింది. దేశం మొత్తం కులగణన తప్పనిసరి అనే భావనకు రావడంతో కేంద్రం తలొగ్గింది. ప్రస్తుత పరిస్థితుల్లో కులగణన అవసరం. ఒత్తిడితోనైనా సరే కులగణన చేపట్టేందుకు కేంద్రం అంగీకరించడాన్ని నేను స్వాగతిస్తున్నా. కులగణన చేపడుతామన్న కేంద్రం ప్రకటన తనకు సంతోషాన్నిచ్చింది. ఆ విషయంలో వాళ్లు ఏదైనా చేయనియ్యండి. కానీ ఒక పద్ధతి ప్రకారం చేయాలి. అప్పుడే అసలైన ఫలితాలు బయటికి వస్తాయి.