లక్నో: కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ శనివారం ఉత్తరప్రదేశ్‌లోని మహిళా రైతులను కలిశారు. బారాబంకి ప్రాంతంలోని వ్యవసాయ క్షేత్రానికి వెళ్లిన ఆమె మహిళా రైతులతో కలిసి అల్పాహారం తీసుకున్నారు. వచ్చే ఏడాది జరుగనున్న ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విధానాల గురించి వారితో చర్చించారు. వారి పని పరిస్థితులను అర్థం చేసుకోవడంతోపాటు, వారి కుమార్తెలను ఎలా పెంచుతున్నారు, ఎలా చదివిస్తున్నారు అన్నది తెలుసుకునేందుకు ఇక్కడకు వచ్చినట్లు ప్రియాంక గాంధీ మీడియాతో అన్నారు. మహిళా రైతుల బాధను పంచుకోవడంతోపాటు కాంగ్రెస్ విధానాలను వారికి తెలియజేసినట్లు చెప్పారు.
కాగా, యూపీ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ ఆమోదించిన పలు తీర్మానాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు మూడు ‘ప్రతిజ్ఞా యాత్ర’లను ప్రియాంక గాంధీ జెండా ఊపి శనివారం ప్రారంభించారు. బారాబంకి నుంచి బుందేల్‌ఖండ్, సహరాన్పూర్ నుంచి మధుర, వారణాసి నుంచి రాయ్‌బరేలీ వరకు మూడు యాత్రలు అక్టోబరు 23 నుంచి నవంబర్ 1 వరకు వేర్వేరు మార్గాల్లో కొనసాగుతాయి.
ఈ సందర్భంగా కాంగ్రెస్ ఎన్నికల మేనిఫెస్టోతో పాటు యూపీ ప్రజల కోసం చేసిన ఏడు తీర్మానాలను ప్రియాంక గాంధీ వివరించారు. పాఠశాల బాలికలకు ఉచిత ఎలక్ట్రిక్ స్కూటీ, మొబైల్ ఫోన్లు, వ్యవసాయ రుణాల మాఫీ, పేద కుటుంబాలకు సంవత్సరానికి రూ. 25,000, అందరికీ సగం విద్యుత్ బిల్లు, కోవిడ్ కాలం నాటి పెండింగ్ విద్యుత్ బిల్లులు పూర్తిగా మాఫీ వంటి మేనిఫెస్టోలోని కొన్ని ముఖ్య వాగ్దానాలను ఆమె వెల్లడించారు.
#WATCH Congress leader Priyanka Gandhi Vadra interacts with women farmers at an agricultural farm in Barabanki
— ANI UP/Uttarakhand (@ANINewsUP) October 23, 2021
"I want to understand their working conditions, how they are raising their daughters and if they are able to educate them," she says. pic.twitter.com/hYTuC2ddUI