న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ, బీఎస్పీ అధినేత్రి మాయావతిని ఆదివారం కలిశారు. మాయావతి తల్లి మరణం పట్ల సంతాపం తెలిపారు. మాయావతి తల్లి రామరతీ గుండెపోటుతో శనివారం మరణించారు. ఢిల్లీలోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆమె అక్కడ తుదిశ్వాస విడిచినట్లు బీఎస్పీ ప్రకటించింది. ఈ నేపథ్యంలో ప్రియాంక గాంధీ ఆదివారం ఉదయం ఢిల్లీలోని త్యాగరాజ మార్గ్‌లో ఉన్న మాయావతి నివాసానికి చేరుకున్నారు. ఆమె తల్లి రామరతీ మరణంపట్ల హృదయపూర్వక సంతాపం తెలిపారు. ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్, సమాజ్‌వాదీ పార్టీ చీఫ్ అఖిలేష్ యాదవ్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు స్వతంత్ర దేవ్ సింగ్ తదితర నేతలు కూడా మాయావతి తల్లి మరణం పట్ల సంతాపాన్ని తెలియజేశారు.