UP P OLLS | అతి త్వరలో కాంగ్రెస్లో ప్రియాంక శకం ప్రారంభం కాబోతుందా? రాహుల్ అధ్యక్ష బాధ్యతలు చేపడతారా? చేపట్టరా? అన్న సందిగ్ధం కాంగ్రెస్లో ఇప్పటికీ నడుస్తోంది. ఈ సందిగ్థం కొనసాగున్న నేపథ్యంలోనే యూపీ ఎన్నికలు వచ్చేశాయి. కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ అన్నీ తానై, ఒంటి చేత్తో యూపీ ఎన్నికల వ్యవహారాన్ని నడుపుతున్నారు. అన్నీ కుదిరితే యూపీ సీఎం అభ్యర్థిగా ప్రియాంక పేరును అధిష్ఠానం ప్రకటించే ఛాన్స్ ఉంది. అన్యాపదేశంగా ప్రియాంక కూడా ఇదే హింట్ ఇచ్చారు. శుక్రవారం యూపీ ఎన్నికల మేనిఫెస్టోను ప్రియాంక విడుదల చేశారు.
ఈ సందర్భంగా విలేకరులు పలు ప్రశ్నలు అడిగారు. యూపీ సీఎం అభ్యర్థి ఎవరు? అని అడగ్గా, ప్రియాంక గాంధీ ఆసక్తికర సమాధానమిచ్చారు. యూపీ కాంగ్రెస్లో నా మొహం తప్ప, ఇతరుల మొహం కనిపిస్తుందా మీకు? ఇకేముంది? అన్ని చోట్లా నా మొహమే కనిపిస్తోంది. అంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల రాజకీయాలు దూరంగా ఉంటానని ప్రియాంక కొన్ని రోజుల క్రితం ఓ సందర్భంలో వ్యాఖ్యానించారు. పరిస్థితుల ప్రభావమో, పార్టీ భవిష్యత్ అవసరాలో తెలియదు కానీ… ఇప్పుడు మాత్రం అధికార రాజకీయాల్లోకి ప్రియాంక ఎంటర్ అవడానికి సిద్ధం అవుతున్నారని ఆమె వ్యాఖ్యల ద్వారా అర్థమవుతోంది.
ఎన్నికల ఫలితాల తర్వాత పొత్తు ఎవరితో ఉంటుందని విలేకరులు అడగ్గా… అలాంటి పరిస్థితి వస్తే మాత్రం ఆ కూటమిలో చేరుతామని, మహిళల సమస్యలు, నిరుద్యోగ సమస్యలు ఎజెండాలో చేర్చి, వాటి పరిష్కరణ కోసం కృషి చేస్తామని చెప్పుకొచ్చారు.