బెంగళూర్ : కర్నాటక సీఎం సిద్ధరామయ్య ఎంతకాలం సీఎం పదవిలో ఉంటారోనని ప్రధాని నరేంద్ర మోదీ వ్యక్తం చేసిన సందేహాలపై కాంగ్రెస్ నేత ప్రియాంక్ ఖర్గే (Priyank Kharge) దీటుగా బదులిచ్చారు. కర్నాటక రాజకీయ చరిత్రను ప్రధాని మోదీ చదవాలని హితవు పలికారు. సిద్ధరామయ్య పదవీకాలంపై ప్రధాని మోదీ సందేహాలు వ్యక్తం చేయడం విస్మయం కలిగిస్తోందని అన్నారు. బీజేపీ హయాంలో ఎనిమిదేండ్లలోనే ఐదుగురు ముఖ్యమంత్రులు మారారని ప్రియాంక్ ఖర్గే ఎద్దేవా చేశారు.
కర్నాటకలోని కలబురగిలో ప్రియాంక్ ఖర్గే మీడియాతో మాట్లాడుతూ గత బీజేపీ సర్కార్ను 40 పర్సెంట్ ప్రభుత్వమని వార్తా పత్రికలు పేర్కొన్నాయని గుర్తుచేశారు. కర్నాటకలో బీజేపీ సర్కార్ను కూలదోసిన ప్రజలు బీజేపీకి అధికారాన్ని కట్టబెట్టారని అన్నారు. కర్నాటకలో బీజేపీ నిర్వాకం అలాగ ఉందని ఖర్గే చురకలు వేశారు. రాజకీయ చర్చకు కాంగ్రెస్ సిద్ధమని కానీ ప్రధాని నరేంద్ర మోదీ కర్నాటక రాజకీయ చరిత్రపై అవగాహన పెంచుకోవాలని హితవు పలికారు.
కర్నాటక సీఎం పదవిలో ఎవరుండాలనేది తమ పార్టీ అంతర్గత వ్యవహారమని ఈ విషయంలో ప్రధానికి ఎందుకంత ఆసక్తని ఖర్గే నిలదీశారు. కాగా, అధిష్టానం ఆదేశిస్తే సీఎం పదవి చేపట్టేందుకు సిద్ధమని ప్రియాంక్ ఖర్గే ఇటీవల పేర్కొన్నారు. సిద్ధరామయ్య, డీకే శివకుమార్ గతంలో సీఎం పదవికి పోటీపడగా తాజాగా సీఎం రేసులో ఖర్గే పేరు వినిపిస్తుండటంతో కర్నాటకలో నాయకత్వ మార్పుపై ఊహాగానాలు చెలరేగుతున్నాయి.
Read More :
Mizoram Assembly Elections: మిజోరంలో ఓటేసిన 101 ఏళ్ల వృద్ధుడు.. 96 ఏళ్ల అంధుడు