చండీగఢ్, సెప్టెంబర్ 18: పంజాబ్‌లోని చండీగఢ్ యూనివర్సిటీ ఆందోళనతో అట్టుడికింది. ఓ విద్యార్థిని తన సహచరుల ప్రైవేట్ వీడియోలను సోషల్‌మీడియాలో పెట్టిందనే ఆరోపణలపై క్యాంపస్‌లో విద్యార్థులు శనివారం రాత్రి పెద్దఎత్తున ఆందోళన చేపట్టారు. స్నానం చేస్తుండగా వీడియోలు తీసి, వాటిని హిమాచల్‌ప్రదేశ్‌లో ఉండే తన బాయ్‌ఫ్రెండ్‌కు ఆమె పంపినట్టు ఆరోపణలు వెల్ల్లువెత్తాయి. వీటిని అతడు సోషల్‌మీడియాలో అప్లోడ్ చేసినట్టు సమాచారం. అయితే, సదరు విద్యార్థిని తన సొంత వీడియోనే షేర్ చేసిందని పోలీసులు వెల్లడించారు. ప్రస్తుతానికి ఐపీసీ సెక్షన్ 354 సీ (వోయూరిజం), ఐటీ చట్టం కింద ఎఫ్ఐఆర్ నమోదు చేసి, విద్యార్థినిని, సిమ్లాలో ఉంటున్న ఆమె బాయ్ ఫ్రెండ్ అరెస్టు చేశామన్నారు. ఘటనపై పంజాబ్ సీఎం భగవంత్‌మాన్ ఉన్నతస్థాయి విచారణకు ఆదేశించారు. పంజాబ్ రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ మనీషా గులాటీ ఘటన వివరాలను విద్యార్థినులను అడిగి తెలుసుకొన్నారు. పోలీసులు పక్కాగా విచారణ జరుపుతున్నారని తెలిపారు.