న్యూఢిల్లీ : దేశంలోని కీలక సంస్థలపై ప్రధాన మంత్రి నరేంద్రమోదీ ఉక్కు పిడికిలి బిగిస్తున్నారు. ఆయా సంస్థల పారదర్శకతకు నిలువునా పాతరేస్తున్నారు. అందుకు దేశ అత్యున్నత ఆడిట్ సంస్థ కాగ్ పనితీరే ప్రత్యక్ష నిదర్శనం. కేంద్రంలో మోదీ అధికార పగ్గాలు చేపట్టిన నాటినుంచి కాగ్ సమర్థంగా పనిచేయడం లేదు. 2015లో కాగ్ మొత్తం 55 నివేదికలను సమర్పించగా.. వాటి సంఖ్య 2015లో 42కు, 2017లో 45కు, 2018లో 23కు, 2019లో 21కి తగ్గింది. 2020లో ఏకంగా 75 శాతం క్షీణించి 14కు దిగజారింది. 2017లో ఏడుగా ఉన్న డిఫెన్స్ ఆడిట్ నివేదికలు 2020లో ‘సున్నా’కు పడిపోయాయి. స్వతంత్రంగా పనిచేయాలని కోరుకునేవారిని, ప్రయత్నించేవారిని శిక్షిస్తున్నారు. పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో కాగ్ 12 నివేదికలను సమర్పించింది.ఆ నివేదికల రూపకల్పనకు బాధ్యులైన కాగ్ అధికారులను కొద్ది రోజులకే బదిలీ చేశారు.
బదిలీకి గురైన కాగ్ అధికారుల్లో దత్తప్రసాద్ సూర్యకాంత్ శిర్సత్ ఒకరు. ఆయుష్మాన్ భారత్-ప్రధాన మంత్రి జన ఆరోగ్య యోజన పథకం పనితీరు ఆడిటింగ్‌కు ఇంచార్జిగా వ్యవహరించిన ఆయన దేశవ్యాప్తంగా 28 రాష్ర్టాల్లోని 161 జిల్లాల్లో 964 దవాఖానలను ఆడిట్ చేశారు. మరణించినవారు, నకిలీ లబ్ధిదారుల పేరుతో క్లెయిములు చేసి ఏకంగా రూ.300 కోట్లకుపైగా నిధులు స్వాహా చేశారని తేల్చడమే శిర్సత్ చేసిన ‘పాపం’.
బదిలీ వేటుకు గురైన మరో అధికారి అతూర్వ సిన్హా. హైవే ప్రాజెక్టులను ఆయన ఆడిట్ చేశారు. ద్వారకా ఎక్స్‌ప్రెస్‌వే ప్రాజెక్టు వ్యయం అంచనా కంటే ఎన్నో రెట్లు భారీగా పెరిగినట్టు సిన్హా తన నివేదికలో నిగ్గు తేల్చడంతో ఆయనను బదిలీ చేశారు.