(స్పెషల్ టాస్క్ బ్యూరో)
హైదరాబాద్, డిసెంబర్ 25 (నమస్తే తెలంగాణ): దేశాభివృద్ధికి గ్రామాల ప్రగతి కీలకమని తరచూ మాటలు చెప్పే ప్రధాని మోదీ గడిచిన ఎనిమిదేండ్లలో తాను దత్తత తీసుకొన్న పల్లెల స్థితిగతులపై మాత్రం దృష్టి పెట్టలేదు. దేశంలోని గ్రామాల అభివృద్ధికి ప్రతీఏటా ఒక పార్లమెంట్ సభ్యుడు ఒక గ్రామం చొప్పున దత్తత తీసుకొని అభివృద్ధి చేయాలని పేర్కొంటూ ప్రధాని మోదీ 2014లో సంసద్ ఆదర్శ్ గ్రామ్ యోజన (ఎస్ఏజీవై)ను ప్రారంభించారు. ఇందులో భాగంగా 2014-2022 మధ్య జయాపుర, నాగేపుర, ఖాఖారియా, డోమరీ, పరమపుర, పురే, పురేబరియార్, కుర్హావు అనే ఎనిమిది గ్రామాలను ఆయన దత్తత తీసుకొన్నారు. అయితే, దత్త పుత్రికలుగా అభివర్ణించిన తన దత్తత గ్రామాల్లో అభివృద్ధి జరుగుతున్నదా? లేదా? అనేదాన్ని ప్రధాని పట్టించుకోవట్లేదు. ప్రధాని దత్తత తీసుకొంటున్నట్టు ప్రకటించగానే ఆయా గ్రామాల్లోని స్థానిక నేతలు, అధికారులు.. హడావుడిగా రోడ్లు, పారిశుద్ధ్యం పనులు ప్రారంభించారు.
ఆ తర్వాత వాటి నిర్వహణ గాలికొదిలేశారు. దాదాపు అన్ని గ్రామాల్లోనూ ఇదే దుస్థితి. ఖాఖారియా గ్రామంలో ఇప్పటికీ తాగునీటి సరఫరా సరిగా లేదు. గ్రామం నడిబొడ్డున ఉన్న బావి నీళ్లే ఆ గ్రామస్థులకు దిక్కు. జయాపురలో మురుగునీటి నిర్వహణ అస్తవ్యస్థంగా ఉన్నది. ఆవాస్ యోజన సరిగా అమలు కాకపోవడంతో పాక్షికంగా కూలిన ఇండ్లల్లోనే నివాసం ఉంటున్నట్టు స్థానికులు చెబుతున్నారు. మరుగుదొడ్లు, పాఠశాల భవనాలు, రోడ్లు, కమ్యూనిటీ హాళ్లు, వైకుంఠధామాలు, డంపింగ్ యార్డులు, విద్యుత్తు స్తంభాలు తదితర సమస్యలు మిగతా గ్రామాలను వేధిస్తున్నట్టు క్షేత్రస్థాయి పరిశీలనలో తేలింది.
తెలంగాణలో పల్లె వెలుగులు
ఎస్ఏజీవైలో తెలంగాణ పల్లెలు సత్తా చాటుతున్నాయి. దేశంలోని టాప్-10 ఆదర్శ గ్రామాల్లో ఏడు గ్రామాలు రాష్ర్టానికి చెందినవే. ప్రధాని మోదీ సొంత రాష్ట్రం గుజరాత్లోని పల్లెలు ఎక్కడా తెలంగాణకు సమీపంలో కూడా లేవు. సీఎం కేసీఆర్ సూచనలతో పల్లె ప్రగతిలో భాగంగా పల్లెపల్లెలో సీసీ రోడ్లు, వైకుంఠధామాలు, డంపింగ్ యార్డులు, విద్యుత్తు సమస్యల పరిష్కారం, నర్సరీ, మొక్కల పెంపకం, ఇంకుడు గంతలు, పారిశుద్ధ్యం వంటివి పెద్దయెత్తున అమలవుతున్నాయి.
పంచాయతీలకు ప్రతినెలా నిధులు విడుదల చేయడం, ఉపాధి హామీ పనులను సద్వినియోగం చేసుకోవడంతో ఇది సాధ్యమైందని అధికారులు చెబుతున్నారు. అందుకే ఎస్ఏజీవై ర్యాంకుల్లో టాప్-20లో 14, టాప్-50లో 22 గ్రామాలు తెలంగాణకు చెందినవే కావడం విశేషం.