రియో డి జెనీరో (బ్రెజిల్), నవంబర్ 18: ప్రపంచంలో నేడు ఆయా దేశాల మధ్య జరుగుతున్న యుద్ధాల కారణంగా ‘గ్లోబల్ సౌత్’ దేశాలు ఆహారం, ఇంధనం, ఎరువుల సంక్షోభాన్ని తీవ్రస్థాయిలో ఎదుర్కొంటున్నాయని భారత ప్రధాని మోదీ ఆందోళన వ్యక్తం చేశారు. ‘గ్లోబల్ సౌత్’ దేశాలు ఎదుర్కొంటున్న ఈ సంక్షోభాన్ని పరిష్కరించటంపై జీ-20 దేశాల కూటమి దృష్టి సారించాల్సిన అవసరముందని ఆయన అన్నారు. సోమవారం బ్రెజిల్ రాజధాని రియో డి జెనీరో వేదికగా జీ20 దేశాల శిఖరాగ్ర సదస్సు ప్రారంభమైంది. సదస్సుకు అమెరికా, చైనా అధ్యక్షులు జో బైడెన్, జీ జిన్పింగ్, బ్రిటిన్ పీఎం స్టార్మర్ సహా ఆయా దేశాల నాయకులు హాజరయ్యారు.
వైద్యులపై దాడి కేసులకు కేంద్ర చట్టం అక్కర్లేదు ; నేషనల్ టాస్క్ ఫోర్స్ సిఫారసు
న్యూఢిల్లీ : వైద్య రంగంలో పనిచేసేవారిపై జరిగే నేరాలపై దర్యాప్తు కోసం ప్రత్యేకంగా కేంద్ర చట్టం అక్కర్లేదని నేషనల్ టాస్క్ ఫోర్స్ (ఎన్టీఎఫ్) చెప్పింది. స్వల్ప నేరాలపై విచారణ కోసం రాష్ర్టాల చట్టాలు సరిపోతాయని, భారతీయ న్యాయ సంహిత (బీఎన్ఎస్) ద్వారా తీవ్రమైన నేరాలను పరిష్కరించవచ్చునని తెలిపింది. కోల్కతా ఆర్జీ కర్ దవాఖానలో ఓ ట్రైనీ వైద్యురాలి హత్యాచారం నేపథ్యంలో సుప్రీంకోర్టు ఎన్టీఎఫ్ను ఏర్పాటు చేసింది. మెడికల్ ప్రొఫెషనల్స్ భద్రత కోసం నిబంధనలను రూపొందించాలని ఆదేశించింది. ఆగస్టు 20న ఏర్పాటైన ఎన్టీఎఫ్ పలు సిఫారసులు చేసింది. వైద్య రంగంలో పని చేసేవారిపై జరిగే హింసాత్మక సంఘటనలపై విచారణ కోసం 24 రాష్ర్టాల్లో ఇప్పటికే చట్టాలు ఉన్నాయని, వీటిలో ‘హెల్త్ కేర్ ఇన్స్టిట్యూషన్స్’, ‘మెడికల్ ప్రొఫెషనల్స్’ పదాలకు నిర్వచనాలు కూడా ఉన్నట్లు వివరించింది.