ప్రయాగ్‌రాజ్, ఫిబ్రవరి 5 : ప్రధాని నరేంద్ర మోదీ బుధవారం త్రివేణీ సంగమంలో పవిత్ర స్నానం ఆచరించారు. మహా కుంభమేళాను సందర్శించడం తన సుకృతమని, భక్తిభావంతో తన హృదయం నిండిపోయిందని ప్రధాని ఈ సందర్భంగా అన్నారు. పవిత్ర స్నానం సందర్భంగా ప్రధాని రుద్రాక్ష మాలను ధరించారు. చిక్కని నారింజ రంగు జెర్సీ, నీలి రంగు ప్యాంటు ధరించిన మోదీ సూర్య భగవానుడికి, గంగా మాతకు ప్రార్థనలు చేశారు. ప్రజలకు శాంతి, జ్ఞానం, మంచి ఆరోగ్యం,సామరస్యాన్ని గంగా మాత ప్రసాదించాలని ప్రార్థించినట్టు ఎక్స్ వేదికగా మోదీ తెలిపారు. దాదాపు గంటన్నర పాటు మహాకుంభ్‌లో గడిపారు. ప్రధాని వెంట ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఉన్నారు.