Thali prices : 2023 ఫిబ్రవరి నెలతో పోల్చుకుంటే ఈ ఏడాది ఫిబ్రవరి నెలలో ఇళ్లలో వండుకునే వెజ్ థాలీ (Veg Thali) ధర ఒక శాతం తగ్గింది. అదే సమయంలో నాన్ వెజ్ థాలీ (Non Veg Thali) ధర 6 శాతం పెరిగింది. క్రిసిల్ (Crisil) తాజా నివేదిక (Report) ఈ విషయాన్ని వెల్లడించింది. గత ఏడాది ఫిబ్రవరి కంటే ఈ ఏడాది ఫిబ్రవరిలో కూరగాయల (Vegetables) ధరలు, వంట గ్యాస్ (LPG gas) సిలిండర్ ధరలు తగ్గడమే వెజ్ థాలీ ధర తగ్గడానికి కారణమని నివేదిక పేర్కొన్నది. అదే సమయంలో బ్రాయిలర్ చికెన్ (Broiler Chicken) ధర పెరగడం నాన్ వెజ్ థాలీ ధర పెరగడానికి కారణమని తెలిపింది.
2023 ఫిబ్రవరిలో కిలో టమాట ధర రూ.32 ఉండగా.. ఈ ఏడాది ఫిబ్రవరిలో అది రూ.23 తగ్గిందని క్రిసిల్ రిపోర్టు పేర్కొన్నది. గత ఏడాది ఫిబ్రవరి కంటే ఈ ఏడాది ఫిబ్రవరిలో మార్కెట్ టమాట పంట 20 శాతం అధికంగా రావడమే టమాట ధర తగ్గడానికి కారణమని తెలిపింది. అదే సమయంలో గత ఫిబ్రవరిలో 14.2 కేజీల ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ ధర రూ.903 గా ఉండెనని, ఈ ఫిబ్రవరిలో అది రూ.803కు తగ్గిందని, ఇది కూడా వెజ్ థాలీ ధరలో తగ్గుదలకు ఒక కారణమని పేర్కొంది.
అయితే టమాట, గ్యాస్ ధరలు తగ్గినా ఈ ఏడాది ఫిబ్రవరిలో ఉల్లిగడ్డ, ఆలుగడ్డ ధరలు 16 శాతం పెరిగాయని, అదేవిధంగా వెజిటెబుల్ ఆయిల్ ధరలు 18 శాతం పెరిగాయని, వెజ్ థాలీ ధర ఇంకా దారుణంగా పడిపోకుండా ఇవి అడ్డుకోగలిగాయని క్రిసిల్ రిపోర్టు వివరించింది. అదేవిధంగా 2023 ఫిబ్రవరితో పోల్చుకుంటే ఈ ఏడాది ఫిబ్రవరిలో బ్రాయిలర్ చికెన్ ధరలు 15 శాతం పెరిగాయని తెలిపింది. నాన్ వెజ్ థాలీ ధరలో 50 శాతం చికెన్ ధరే ఉన్నదని పేర్కొంది.
గత ఏడాది బ్రాయిలర్ చికెన్ సరఫరా ఎక్కువగా ఉండటంతో ధరలు తక్కువగా ఉన్నాయని, ఈ ఏడాది అంత సరఫరా లేకపోగా, కోళ్ల దాణా ధర కూడా 6 శాతం పెరిగిందని అందుకే నాన్ వెజ్ థాలీ ధర పెరిగిందని క్రిసిల్ రిపోర్టు వెల్లడించింది.