న్యూఢిల్లీ: సామాజిక మాధ్యమాల ద్వారా కొన్ని వర్గాలు కోర్టు తీర్పులను ప్రభావితం చేసే ప్రయత్నాలు చేస్తున్నట్టు విశ్రాంత భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ చెప్పారు. ఈ విషయంలో న్యాయమూర్తులు అప్రమత్తంగా ఉండాలన్నారు. ఎన్డీటీవీ ఇండియా నిర్వహించిన కార్యక్రమంలో ఆదివారం ఆయన పాల్గొన్నారు. సామాజిక మాధ్యమాల్లో ట్రోలింగ్ ప్రభావం న్యాయమూర్తులపైన ఉంటుందా? అని ప్రశ్నించినపుడు ఆయన స్పందిస్తూ, ‘నేడు ప్రత్యేక ఆసక్తిగల వర్గాలు, ఒత్తిడి తెచ్చే గ్రూపులు ఉన్నాయి. వీరు న్యాయస్థానాలను, కేసుల ఫలితాలను ప్రభావితం చేయడానికి సామాజిక మాధ్యమాలను వాడుకోవాలని ప్రయత్నిస్తుంటారు. ఓ తీర్పునకు ప్రాతిపదిక ఏమిటో తెలుసుకునే హక్కు, కోర్టు తీర్పులపై తమ అభిప్రాయాలను వ్యక్తం చేసే హక్కు ప్రతి ఒక్కరికీ ఉన్నాయి. అయితే, ఇది కోర్టు తీర్పులకు అతీతంగా, న్యాయమూర్తులను వ్యక్తిగతంగా లక్ష్యంగా చేసుకున్నపుడు, ఇది నిజంగా వాక్ స్వాతంత్య్రం, భావ ప్రకటన స్వేచ్ఛయేనా? అనే ప్రాథమిక ప్రశ్నలు ఉత్పన్నమవుతాయి’ అని చంద్రచూడ్ చెప్పారు. నేటి ప్రజలు యూట్యూబ్, ఇతర సామాజిక మాధ్యమాల్లో 20 సెకండ్ల వీడియోను చూసి, దాని ఆధారంగా అభిప్రాయం ఏర్పరచుకోవాలని అనుకుంటున్నారని, ఇది చాలా ప్రమాదకరమని తెలిపారు. న్యాయమూర్తులు పదవీ విరమణ చేసిన తర్వాత రాజకీయాల్లో ప్రవేశించరాదని రాజ్యాంగం కానీ, చట్టాలు కానీ చెప్పడం లేదన్నారు. సమాజం న్యాయమూర్తిని పదవీ విరమణ తర్వాత కూడా జడ్జిగానే చూస్తుందని, అందువల్ల ఇతరులు చేయడం సరైనదే అని భావించే పనులను న్యాయమూర్తులు పదవీ విరమణ తర్వాత అయినా చేయడం సరైనది కాదన్నారు. సమాఖ్య వ్యవస్థలో కొలీజియం చాలా మంచి విధానమని చెప్పారు.