Maha Kumbh | ప్రపంచంలోనే అతిపెద్ద ఆధ్యాత్మిక కార్యక్రమం మహా కుంభమేళా సోమవారం ఘనంగా ప్రారంభమైంది. గంగా, యయున, సరస్వతీ నదులు ప్రయాగ్‌రాజ్‌లో ఒకటిగా కలిసే త్రివేణి సంగమంలో పుష్య మాసం పౌర్ణమి సందర్భంగా మహా కుంభమేళా వేడుకలు మొదలయ్యాయి. దాదాపు 45 రోజుల పాటు కొనసాగి.. ఫిబ్రవరి 26తో ముగుస్తాయి. అయితే, ఈ సారి మహా కుంభమేళాకు ఎంతో విశిష్టత ఉన్నది. 144 సంవత్సరాల తర్వాత మహా కుంభమేళా జరుగుతుంది. సాధారణంగా ప్రతి ఆరు సంవత్సరాలకోసారి అర్ధ కుంభమేళా జరుగుతుంది. 12 సంవత్సరాలకోసారి కుంభమేళా నిర్వహిస్తారు. 144 సంవత్సరాలకోసారి మహా కుంభమేళా జరుగుతుంది.
Maha Kumbh
సాధారణంగా ఏటా కుంభమేళా నాలుగు ప్రాంతాల్లో జరుగుతుంది. ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్, ఉత్తరాఖండ్‌లోని హరిద్వార్, మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయిని, మహారాష్ట్రలోని నాసిక్ కుంభమేళాలో జరుగుతుంది. అయితే, 144 సంవత్సరాలకోసారి జరిగే మహా కుంభమేళా మాత్రం కేవలం ప్రయాగ్‌రాజ్‌లోనే నిర్వహిస్తారు. సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించిన సమయంలో మహా కుంభమేళా మొదలవుతుంది. భూమిపై ఏడాది దేవతలకు ఒకరోజుతో సమానం. దేవతలు, రాక్షసుల మధ్య 12 సంవత్సరాల పాటు యుద్ధం జరిగింది. పన్నెండేళ్లకోసారి పూర్ణకుంభమేళా నిర్వహిస్తారు. దేవతలకు 12 సంవత్సరాలైతే.. భూమిపై 144 సంవత్సరాలకు సమానం అవుతుంది. అందుకే 144 సంవత్సరాలకోసారి మహా కుంభమేళా జరుగుతుంది. ఈ మహా కుంభమేళాను కేవలం ప్రయాగ్‌రాజ్‌లోనే నిర్వహిస్తారు. గంగా, యమునా, సరస్వతీ నదుల సంగమం కావడంతో ప్రయాగ్‌రాజ్‌లోనే జరుగుతుంది.
Maha Kumbh
ప్రయాగ్‌రాజ్ త్రివేణి సంగమం, హరిద్వార్‌లోని గంగానది, నాసిక్ గోదావరి నది, ఉజ్జయినీ శిప్రా నదిలో కుంభమేళా జరుగుంది. కుంభమేళా సమయంలో ఈ నదుల్లో పుణ్యస్నానాలు ఆచరిస్తే మోక్షం లభిస్తుందని హిందువుల విశ్వాసం. పురాణాల ప్రకారం.. అమృతం కోసం దేవతలు ఓ వైపు, రాక్షసులు కలిసి క్షీరసాగర మథనం చేస్తారు. ఆ సమయంలో బయటికి వచ్చిన అమృతం కోసం.. దేవతలు, రాక్షసుల మధ్య 12 రోజుల పాటు యుద్ధం జరిగింది. ఆ అమృత భాండం నుంచి కొన్ని చుక్కలు భూమిపై పడ్డాయని.. ఆ అమృతం ప్రయాగ్‌రాజ్, ఉజ్జయినీ, హరిద్వార్, నాసిక్‌లోనే పడ్డాయని.. అందుకే అక్కడ కుంభమేళా జరుగుతుంది.
Maha Kumbh
మహా కుంభమేళాలో రాజ స్నానాలకు ప్రాముఖ్యం ఉంటుంది. మహా కుంభమేళాలో తొలిరోజున పుష్య పౌర్ణమి సందర్భంగా తొలి రాజ స్నానం జరుగుంది. ఆ తర్వాత 14న మకర సంక్రాంతి సందర్భంగా రెండో రాజ స్నానం జరుగుతుంది. 29న మౌని అమావాస్య రోజున మూడో స్నానం.. ఇక నాలుగో రాజ స్నానం ఫిబ్రవరి 3న వసంత పంచమి రోజున.. ఐదో స్నానం ఫిబ్రవరి 12న మాఘ పౌర్ణమి రోజున.. చివరిదైన ఆరో రాజ స్నానం మహా కుంభమేళా ముగిసే ఫిబ్రవరి 26న మహాశివరాత్రి రోజున జరుగుతుంది. మహా కుంభమేళా సమయంలో త్రివేణి సంగమంలో స్నానం చేస్తే సమస్త పాపాలు నశించి.. మోక్షం లభిస్తుందని భక్తుల విశ్వాసం.
Maha Kumbh
కుంభమేళాకు ఎంతో ప్రాధాన్యం ఉంది. మహా కుంభమేళాకు ప్రపంచవ్యాప్తంగా హిందువులు తరలివస్తారు. సాధువులు సైతం పెద్ద ఎత్తున తరలివచ్చి స్నానాలు చేస్తారు. మహా కుంభమేళాకు దాదాపు 850 సంవత్సరాలకుపైగా చరిత్ర ఉందని చరిత్రకారులు పేర్కొంటున్నారు. మహా కుంభమేళాను ఆదిశంకరాచార్యలు ప్రారంభించినట్లు తెలుస్తున్నది. కుంభమేళా తేదీలను రాశులను బట్టి నిర్ణయిస్తారు. సూర్యుడు, బృహస్పతి సంచారాన్ని పరిశీలించి.. కుంభమేళా తేదీలను నిర్ణయిస్తారు. సూర్యుడు, బృహస్పతి.. సింహరాశిలో ఉన్న సమయంలో నాసిక్‌లో కుంభమేళ జరుగుంది. సూర్యుడు మేష రాశిలో ఉన్నప్పుడు హరిద్వార్‌లో.. గురుగ్రహం వృషభ రాశిలో, సూర్యుడు మకరంలో ఉన్నప్పుడు ప్రయాగ్‌రాజ్‌లో జరుగుతుంది. బృహస్పతి, సూర్యుడు వృశ్చిక రాశిలో ఉన్నప్పుడు ఉజ్జయినిలో కుంభమేళా నిర్వహించడం ఆనవాయితీగా వస్తున్నది.
Maha Kumbh
కుంభమేళా మూడు రకాలు. అర్ధ కుంభమేళా, పూర్ణ కుంభమేళా, మహా కుంభమేళా జరుగుతుంది. ప్రతి ఆరు సంవత్సరాలకోసారి నిర్వహించేది అర్ధ కుంభమేళా జరుగుంది. చివరి అర్ధకుంభమేళా 2019లో జరిగింది. ఇక ప్రతి 12 సంవత్సరాలకోసారి నిర్వహించేదాన్ని పూర్ణ కుంభమేళాగా పిలుస్తుంటారు. చివరిసారిగా పూర్ణ కుంభమేళా 2013లో జరిగింది. 12 పూర్ణ కుంభమేళాల తర్వాత.. 144 ఏళ్లకు ఒకసారి వచ్చేదే మహా మేళా జరుగుతుంది. ఈ సారి ప్రయాగ్‌రాజ్‌లో జరుగుతున్నది మహా కుంభమేళా. ఈ మహా కుంభమేళాను చూడడం అదృష్టమని.. ప్రతి మూడు తరాల్లో ఒక్కరికి మాత్రమే ఈ ఉత్సవంలో పాల్గొనే అవకాశం దక్కుతుందని ఆధ్యాత్మిక వేత్తలు పేర్కొంటున్నారు.
Maha Kumbh
చివరగా 2013లో జరిగిన కుంభమేళాకు దేశ విదేశాల నుంచి భక్తులతో పాటు సాధువులు మొత్తంగా 20 కోట్ల వరకు హాజరయ్యారని అంచనా. ఈ సారి మహా కుంభమేళాకు దాదాపు 40కోట్లకుపైగా వస్తారని అంచనా వేస్తున్నారు. ప్రయాగ్‌రాజ్‌లో జరుగుతున్న ఆధ్యాత్మిక ఉత్సవానికి యూపీ ప్రభుత్వం రూ.2100కోట్ల స్పెషల్ గ్రాంట్ మంజూరు చేసింది. మహా కుంభమేళాకు లక్షలాది మంది సాధవులు, సన్యాసులు హాజరవనుండగా.. కుంభమేళాలో స్నానాలకు వచ్చే సాధువులు, సన్యాసుల కోసం ప్రయాగ్‌రాజ్‌లో ప్రత్యేక స్థలాలను కేటాయించింది.