Prasoon Joshi : ప్రముఖ గీత రచయిత (Lyricist), సాహిత్యాకారుడు (Writer), కమ్యూనికేషన్స్ నిపుణుడు ప్రసూన్ జోషి (Prasoon Joshi) భారత ప్రభుత్వ ప్రసార సంస్థ అయిన ప్రసార భారతి (Prasar Bharati) కి ఛైర్మన్గా నియమితులయ్యారు. ఈ మేరకు కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ (Union Information and Broadcasting Ministry) శనివారం ఒక అధికారిక ప్రకటన విడుదల చేసింది. జోషి.. సాహిత్యం, ప్రకటనలు, సినిమా, ప్రజా సమాచార రంగాల్లో విస్తృతమైన కృషి చేశారని కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ ఆ ప్రకటనలో కొనియాడింది.
ప్రభావవంతమైన రచనలు, లోతైన సాంస్కృతిక అవగాహనకు పేరుగాంచిన విశిష్ట సృజనాత్మక నిపుణుడైన జోషి.. సమకాలీన భారతీయ మీడియా కథనాలను తీర్చిదిద్దడంలో గణనీయమైన పాత్ర పోషించారని కేంద్రం తన ప్రకటనలో పేర్కొన్నది. జోషి చేసిన కలం నుంచి జాలువారిన ఎన్నో సినీ గీతాలు ప్రశంసలు అందుకున్నాయని తెలిపింది. జోషి రచనల్లో దేశవ్యాప్తంగా విభిన్న ప్రేక్షకులతో మమేకమయ్యే సామాజిక స్పృహతో కూడిన కథనాలు ఉన్నాయని పేర్కొన్నది.