పాట్నా, మే 5: ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ కొత్త రాజకీయ పార్టీ పెడతారా.. లేదా.. అన్న ఊహాగానాలకు తాత్కాలికంగా బ్రేక్ పడింది. తాను రాజకీయ పార్టీని ప్రారంభించడం లేదని ప్రశాంత్ కిశోర్ గురువారం చెప్పారు. అయితే, ‘జన్ సురాజ్’ పేరుతో ఓ వేదికను ఏర్పాటు చేస్తానని, బీహార్ అభివృద్ధిని కోరుకొనేవాళ్లు ఈ వేదికపై కలిసి పనిచేయవచ్చని పేర్కొన్నారు. ఇది భవిష్యత్తులో రాజకీయ పార్టీగా రూపుదిద్దుకొనే అవకాశాలు లేకపోలేదని తెలిపారు.
విలేకరులతో ప్రశాంత్ కిశోర్ మాట్లాడుతూ ‘రాజకీయ పార్టీని ప్రారంభించాలనుకొంటే ఎన్నికలకు నాలుగైదు నెలల ముందు కూడా చేయవచ్చు. నాలుగేండ్ల దాకా బీహార్‌లో ఎన్నికలు లేవు. ఇప్పుడు నేను ప్రజలను నేరుగా కలుస్తాను’ అని వ్యాఖ్యానించారు. ఇందుకోసం అక్టోబర్ 2న చంపారన్‌లోని గాంధీ ఆశ్రమం నుంచి పాదయాత్ర ప్రారంభిస్తానని వెల్లడించారు. యాత్ర ఏడాది పాటు 3వేల కిలోమీటర్లు సాగుతుందని తెలిపారు. బీహార్‌లో సమస్యలు, పరిష్కారాలపై తాను 18వేల మందితో మాట్లాడినట్టు ప్రశాంత్ కిశోర్ చెప్పారు. పాదయాత్రలో భాగంగా వారందరినీ నేరుగా కలుస్తానని అన్నారు.