ముక్తసర్: పంజాబ్ మాజీ సీఎం ప్రకాశ్ సింగ్ బాదల్(Prakash Singh Badal) కన్నుమూసిన విషయం తెలిసిందే. ఇవాళ మధ్యాహ్నం ఆయన అంత్యక్రియలు నిర్వహించనున్నారు. ప్రకాశ్ సింగ్ బాదల్ ప్రత్యర్థులు కూడా ఆయన్ను గుర్తు చేసుకుంటున్నారు. ప్రకాశ్ గొప్ప నేత అని కీర్తించారు. రాష్ట్ర రాజకీయాల్లో ఆయన లేని లోటు పూడ్చలేనిదంటున్నారు.
బాదల్ చాలా సాదాసీదా మనిషి. అందరికీ అందుబాటులో ఉంటారు. క్రమశిక్షణలో నెంబర్ వన్. వినయశీలి. సామాజిక సమానత్వాన్ని, సోదరభావాన్ని కలిగి ఉండాలని ఆయన ఎప్పుడూ తన ప్రసంగాల్లో చెప్పేవారు. ముందు నుంచీ కాంగ్రెస్ పార్టీని తీవ్రంగా వ్యతిరేకించిన అకాలీదళ్‌నేత ఆయన. గోల్డెన్ టెంపుల్‌పై జరిగిన దాడిని ఆయన తన ప్రతి ప్రసంగంలోనూ గుర్తు చేసేవారు. ఏ అంశాన్ని కూడా బాదల్ సాహెబ్ పర్సనల్‌గా తీసుకునేవారు కాదని ఆయన సన్నిహితులు చెబుతుంటారు. తన సుదీర్ఘ రాజకీయ కెరీర్లో ఆయన ఎప్పుడూ ఆందోళన చెందలేదన్నారు.
పేదల సంక్షేమం కోసం బాదల్ క్రియాశీలంగా పనిచేశారు. సీఎంగా ఉన్నప్పుడు ఆయన ఎన్నో స్కీమ్‌లను ప్రవేశపెట్టారు. యువతను కాకాజీ అని, వృద్ధులను సాహిబె అని ఆయన పిలిచేవారు. ఓ పార్టీ నుంచి ఎన్నికైన ప్రజాప్రతినిధి మరో పార్టీలోకి మారకుండా ఉండేందుకు కఠిన చట్టాన్ని తయారు చేయాలని ఆయన ఎప్పుడూ తన స్వరాన్ని వినిపించేవారు.
వ్యవసాయం అంటే ప్రకాశ్ సింగ్ బాదల్‌కు ఇష్టం. ఎప్పుడైనా రెస్టు తీసుకోవాలని ఆయనకు డాక్టర్లు సూచిస్తే, అప్పుడు ఆయన తన వ్యవసాయ క్షేత్రం నుంచి వీడియోలు తెప్పించుకుని చూసేవారు. భార్య, సోదరుడు దాస్ జీ చనిపోయినప్పుడు మాత్రమే ఆయన కొంత ఉద్వేగానికి లోనైనట్లు సన్నిహితులు చెబుతుంటారు. అకాలీదళ్‌లో సుఖ్బీర్, మన్‌ప్రీత్‌లు ఒక్కటి కావాలన్నదే ప్రకాశ్ సింగ్ బాదల్ కాంక్ష.
గత కొన్నేళ్ల వరకు కూడా బాదల్ తెల్లవారుజామున 4.30 నిమిషాలకే లేచేవారు. ఆ తర్వాత ఆయన వ్యాయామం చేసేవారు. ఆయన రోజుకు మూడుసార్లు సిక్కు ప్రార్థనలు చేసేవారు. సీఎంగా ఉన్న సమయంలో ఉదయమే పత్రికలు చదివేవారు. కీలక అంశాలపై హుటాహుటిన అధికారులతో చర్చించి డైరెక్ట్‌గా ఫీడ్‌బ్యాక్ తెప్పించుకునేవారు. ఆఫీసు వేళ్లలో ఆయన కాసేపు కునుకు తీసేవారు. బాదల్ రాత్రి 8 గంటలకే నిద్రలోకి వెళ్లేవారట.