న్యూఢిల్లీ: నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ)లో సంక్షోభం (NCP crisis), తిరుగుబాటును ఆ పార్టీ చీఫ్ శరద్ పవార్ సీరియస్‌గా పరిగణించారు. ఆయన అధ్యక్షతన గురువారం ఢిల్లీలో జరిగిన జాతీయ సమావేశంలో కఠిన చర్యలు చేపట్టారు. ఎన్సీపీ వర్కింగ్ కమిటీ 8 తీర్మానాలను ఆమోదించింది. అజిత్ పవార్ తిరుగుబాటుకు సహకరించిన ప్రఫుల్ పటేల్, సునీల్ టట్కరే, మరో 9 మంది ఎమ్మెల్యేలను పార్టీ నుంచి బహిష్కరించింది. ఎన్సీపీ వర్కింగ్ కమిటీ ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు ఆ పార్టీ నేత పీసీ చాకో తెలిపారు. తిరుగుబాటు నేత అజిత్ పవార్ జాతీయ అధ్యక్షుడిగా ఎన్నికైనట్లు ఆ వర్గం చేసిన వాదనను ఆయన తోసిపుచ్చారు. అలాంటి వాదనలకు పసలేదన్నారు. 27 రాష్ట్ర యూనిట్ల నేతలంతా శరద్ పవార్‌కు మద్దతుగా ఈ సమావేశానికి హాజరైనట్లు వెల్లడించారు.
కాగా, గురువారం ఢిల్లీలో ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్ అధ్యక్షతన ఆ పార్టీ జాతీయ కార్యవర్గ సమావేశం జరిగింది. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ఎన్సీపీ అధ్యక్షుడ్ని తానేనని అన్నారు. ఎన్సీపీ అధ్యక్షుడిగా ఎవరన్నా చెప్పుకుంటే అది పూర్తిగా తప్పని అన్నారు. అందులో ఎలాంటి నిజం లేదని చెప్పారు. అజిత్ పవర్ స్టేట్మెంట్కు ఎలాంటి ప్రాముఖ్యత లేదన్నారు.
మరోవైపు శరద్ పవర్ నేతృత్వంలో జరిగిన జాతీయ కార్యవర్గ సమావేశం, అందులో చేసిన తీర్మానాలకు ఎలాంటి చట్టబద్ధత లేదని అజిత్ పవర్ వర్గం తెలిపింది. ఎన్సీపీ వివాదం ప్రస్తుతం ఎన్నికల సంఘం పరిధిలో ఉన్నట్లు పేర్కొంది.