ముంబై: మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్‌కు పోటీగా డిప్యూటీ సీఎం ఏక్నాథ్ షిండే సమాంతర కార్యాలయాలు ఏర్పాటు చేశారు. ఈ నేపథ్యంలో ఆ రాష్ట్రంలోని మహాయుతి ప్రభుత్వంలో అధికార పోరు (Power tussle) జరుగుతున్నట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ ఒక సహాయ కేంద్రం, వైద్య సహాయ కేంద్రం ఏర్పాటు చేశారు. దీనికి ధీటుగా డిప్యూటీ సీఎం ఏక్నాథ్ షిండే కూడా ఫడ్నవీస్ కార్యాలయాల పక్కనే తన సొంత వైద్య సహాయ కేంద్రాన్ని నిర్వహిస్తున్నారు.
కాగా, మహారాష్ట్ర సచివాలయమైన మంత్రాలయం బిల్డింగ్ ఏడో అంతస్తులోని వార్ రూమ్‌లో కీలక ప్రాజెక్టులు, ముఖ్యమైన సమావేశాలను సీఎం ఫడ్నవీస్ పర్యవేక్షిస్తున్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్రంలోని ప్రధాన ప్రాజెక్టులను సమీక్షించడానికి డిప్యూటీ సీఎం ఏక్నాథ్ షిండే కూడా వార్ రూమ్ సమీపంలో సమన్వయ కమిటీ రూమ్‌ను ఏర్పాటు చేశారు. దీంతో దేవేంద్ర ఫడ్నవీస్, ఏక్నాథ్ షిండే మధ్య అధికార పోరు జరుగుతున్నట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
మరోవైపు సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ దీనిని తేలికగా తీసుకున్నారు. ఈ కార్యాలయాలను షిండే ఏర్పాటు చేయడంలో ఎలాంటి తప్పులేదని తెలిపారు. తమ ప్రభుత్వం సజావుగా పనిచేస్తున్నదని స్పష్టం చేశారు.