BRICS meet : బ్రిక్స్ (BRICS) విద్యుత్ మంత్రుల సమావేశానికి భారత్ తరఫున కేంద్ర గృహ నిర్మాణ, పట్టణ వ్యవహారాల, విద్యుత్ శాఖల మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ (Manoharlal Khattar) హాజరుకానున్నారు. ఈ నెల 19న బ్రెజిల్ (Brazil) దేశంలో బిక్స్ విద్యుత్ మంత్రుల సమావేశం జరగనుంది. ఈ సమావేశానికి భారత్ తరఫున ఖట్టర్ వెళ్తున్నారని కేంద్ర విద్యుత్ శాఖ (Union Power Ministry) శనివారం అధికారిక ప్రకటన చేసింది.
గడిచిన దశాబ్ద కాలంలో విద్యుత్ రంగంలో భారత్ సాధించిన లక్ష్యాలను బ్రిక్స్ సమావేశంలో మనోహర్‌లాల్ ఖట్టర్ వివరించనున్నారు. దేశంలో 90 శాతం పెరిగిన విద్యుత్ సామర్థ్యం, పునరుత్పత్తి ఇంధనంలో నాయకత్వం, గ్రీన్ హైడ్రోజన్, జీవ ఇంధనాలు, అదేవిధంగా నూతన ఆవిష్కరణలు, సుస్థిరాభివృద్ధి తదితర అంశాలను బ్రిక్స్ మీట్లో ఖట్టర్ ప్రస్తావించనున్నారు.