Power Consumption | న్యూఢిల్లీ, జూలై 31: భారత్‌లో విద్యుత్తు వినిమయ అవసరాలు నానాటికీ పెరుగుతున్నాయి. దీంతో 2023లో మన దేశ విద్యుత్తు డిమాండ్ 7% పెరిగింది. ఇది ప్రపంచ సగటు (2.2%) కంటే చాలా ఎక్కువ. ఈ నేపథ్యంలో 2027 నాటికి భారత్‌లో సాయం త్రం వేళల్లో విద్యుత్తు కోతలు మరింత పెరగడం ఖాయమని ఓ అధ్యయనం వెల్లడించింది. పునరుత్పాదక ఇంధన వనరుల ద్వారా తగినంత విద్యుత్తును ఉత్పత్తి చేసుకోకపోవడమే ఇందుకు కారణమని యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా (బర్కిలీ) ఆధ్వర్యంలోని ఇండియా ఎనర్జీ అండ్ ైక్లెమేట్ సెంటర్ తన అధ్యయన నివేదికలో స్పష్టం చేసింది. 2027 నాటికి భారత్‌లో ఉన్న అన్ని కోల్ ప్లాంట్లు, థర్మల్ విద్యుత్తు వ్యవస్థలు పూర్తిస్థాయిలో పనిచేసినప్పటికీ ఈ పరిస్థితి తప్పదని పేర్కొన్నది.
ప్రస్తుతం మన దేశం 446 గిగావాట్ల స్థాపిత విద్యుత్తు సామర్థ్యాన్ని కలిగి ఉన్నది. దీనిలో బొగ్గు ద్వారా 211 గిగావాట్లు, పునరుత్పాదక ఇంధన వనరుల ద్వారా 195 గిగావాట్ల విద్యుత్తు వస్తుండగా.. మిగిలినదంతా గ్యాస్, అణుశక్తి ద్వారా ఉత్పత్తి అవుతున్నది. కానీ, ఇంత సామర్థ్యం అన్ని సమయాల్లో అందుబాటులో ఉండదు. దీంతో పగలంతా ఉండే హీట్‌వేవ్ ప్రభావం రాత్రి కూడా కొనసాగితే ఏసీల వినియోగం వల్ల విద్యుత్తు డిమాండ్ మరింత అధికమవుతుంది. ఈ సమస్యను పరిష్కరించుకోవాలంటే భారత్ మరిన్ని సోలార్ పవర్ ప్లాంట్ల ను ఏర్పాటు చేసుకోవడంతోపాటు వాటి ద్వారా ఉత్పత్తయ్యే సౌరవిద్యుత్తును బ్యాటరీల్లో నిల్వచేసుకోగల సామర్థ్యాన్ని పెంపొందించుకోవాలని పరిశోధకులు స్పష్టం చేశారు.