న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా హీట్‌వేవ్ కొనసాగుతున్నది. ఎండలు దంచికొడుతున్నాయి. చాలా చోట్ల అధిక ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నాయి, కొన్ని చోట్ల వరుసగా గత కొన్ని రోజుల నుంచి ఎండ తీవ్రత 40 డిగ్రీలు దాటుతోంది. అయితే అదే స్థాయిలో విద్యుత్తు వినియోగం(Power Demand) కూడా జరుగుతున్నది. సోమవారం ఒక్క రోజే దేశవ్యాప్తంగా గరిష్టంగా 255.85 గిగావాట్ల విద్యుత్తును వినియోగించినట్లు ప్రభుత్వం పేర్కొన్నది. ఎయిర్ కండీషనర్లు, డిజర్ట్ కూలర్లు అధికంగా వాడడం వల్ల విద్యుత్తు వినియోగం కూడా పీక్ స్థాయికి చేరుకున్నది. విద్యత్తు శాఖ డేటా ప్రకారం సోమవారం , ఏప్రిల్ 27వ తేదీన సుమారు 256 గిగా వాట్ల విద్యుత్తు వినియోగం జరిగినట్లు తెలిసింది.
ఈనెలలో విద్యుత్తు వినియోగం గణనీయంగా పెరుగుతూ వచ్చింది. ఈ నెల రెండో అర్థభాగం నుంచి విద్యుత్తు మోత మోగుతున్నది. శుక్రవారం రోజు 252.07 గిగావాట్లు, శనివారం ఏప్రిల్ 25వ తేదీన 256.11 గిగావాట్ల వినియోగం జరిగినట్లు ప్రభుత్వం పేర్కొన్నది. అయితే గత ఆదివారం విద్యుత్తు వినియోగం తగ్గింది. ఆదివారం 238.15 గిగావాట్ల విద్యుత్తును వినియోగించారు. కమర్షియల్, ఇండస్ట్రీయల్ కంపెనీలు ఎక్కువగా సెలువు తీసుకోవడం వల్ల ఆదివారం విద్యుత్తు వినియోగం తగ్గినట్లు అంచనా వేశారు. దీంతో పాటు కొన్ని చోట్లు డస్ట్ స్టార్మ్, వర్షాలు పడడం వల్ల ఆదివారం వినియోగం తగ్గింది.
గత ఏడాది అత్యధికంగా విద్యుత్తు వినియోగం జూన్‌లో రికార్డు అయ్యింది. 2025 జూన్‌లో ఓ రోజు గరిష్టంగా సుమారు 242.77 గిగావాట్ల విద్యుత్తును వినియోగించారు. 2024లో గరిష్టంగా 250గిగావాట్ల విద్యుత్తును మే నెలలో వాడారు. ఇక 2023లో సెప్టెంబర్‌లో సుమారు 243.27 గిగావాట్ల విద్యుత్తును వినియోగించారు. ఈ ఏడాది వేసవిలో ఎండలు మండనున్నట్లు ఐఎండీ హెచ్చరించిన విషయం తెలిసిందే. ఈ ఏడాది గరిష్టంగా 270 గిగావాట్ల విద్యుత్తు వినియోగం జరిగే అవకాశం ఉన్నట్లు ప్రభుత్వ నిపుణులు చెబుతున్నారు.