Power Crisis | దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో ఎండలు దంచికొడుతున్నాయి. దాంతో చాలా రాష్ట్రాల్లో విద్యుత్ డిమాండ్ విపరీతంగా పెరిగింది. ఈ క్రమంలో కరెంటు కోతలు వేధిస్తున్నాయి. రాబోయే రోజుల్లో కరెంటు కోతల సమస్య మరింత పెరిగే అవకాశం ఉన్నది. జూన్‌లో మరిన్ని ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని కేంద్ర ప్రభుత్వ వర్గాలు అంచనా వేస్తున్నాయి. జూన్‌లో విద్యుత్ సంక్షోభం మరోసారి తీవ్రమయ్యే అవకాశం ఉందని భావిస్తున్నారు. జల విద్యుత్ ఉత్పత్తి తగ్గడం, థర్మల్ ఆధారిత ప్లాంట్ల కమిషన్‌లో జాప్యం కారణంగా సంక్షోభ పరిస్థితులు నెలకొనున్నట్లు సంబంధిత వర్గాలు పేర్కొంటున్నాయి. ఇదిలా ఉండగా సంక్షోభం నుంచి రాష్ట్రాలను గట్టెక్కించేందుకు ప్రయత్నాలు ప్రారంభించింది. జూన్‌లో పగలు, రాత్రి సమయాల్లో విద్యుత్ డిమాండ్ తగినంతగా తీరుతుందని భావిస్తున్నారు.
జలవిద్యుత్ ఉత్పత్తి తగ్గడంతో జూన్‌లో భారతదేశం విద్యుత్ కొరతను ఎదుర్కొంటుందని ప్రభుత్వ వర్గాలు భావిస్తున్నాయి. అయితే ఈ సమస్యను అధిగమించేందుకు అనుకున్న ప్లాంట్ నిర్వహణను వాయిదా వేసి మూతపడిన యూనిట్లను పునః ప్రారంభించే చర్యలు మొదలుపెట్టింది. 3.6 గిగావాట్ల కొత్త బొగ్గు ఆధారిత ప్లాంట్ల కమీషన్లో జాప్యం కారణంగా విద్యుత్ సంక్షోభం ఏర్పడనున్నట్లు తెలుస్తున్నది. మార్చిలోగానే వాటిని ప్రారంభించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. సెంట్రల్ ఎలక్ట్రిసిటీ అథారిటీ ప్రకారం.. జూన్‌లో రాత్రి సమయంలో 14 GW వరకు భారీ కొరత ఏర్పడవచ్చని తెలుస్తున్నది.
గ్రిడ్-ఇండియా జూన్‌లో గరిష్ఠంగా రాత్రి సమయంలో 235 GW డిమాండ్‌ను అంచనా వేసింది. ప్రభుత్వ వర్గాల ప్రకారం.. సుమారు 187 GW థర్మల్ సామర్థ్యం సరఫరా వైపు అందుబాటులో ఉన్నది. 34 GW పునరుత్పాదక వనరుల నుంచి అందుబాటులో ఉన్నది. ప్రభుత్వ గణాంకాల ప్రకారం.. మార్చి 31తో ముగిసిన ఆర్థిక సంవత్సరంలో జలవిద్యుత్ ఉత్పత్తి నాలుగు దశాబ్దాల్లో అత్యంత వేగంగా పడిపోయింది. అయితే, పునరుత్పాదక ఇంధన ఉత్పత్తి స్థిరంగా ఉంది. ఈ అంతరం 2009-10 తర్వాత ఎక్కువగా ఉన్నది. ఇందుకు సంబంధించి గతవారం కీలక సమావేశం జరిగింది. జూన్‌లో ప్రణాళికాబద్ధమైన నిర్వహణ కోసం పవర్ ప్లాంట్లను మూసివేయాలని.. ఐదు గిగావాట్ల సామర్థ్యం వరకు థర్మల్ ప్లాంట్లను పునః ప్రారంభించాలని నిర్ణయించారు.