వారణాసి: వారణాసిలోని గంగా నది ఒడ్డున ఉన్న ఘాట్లకు, దేవాలయాలకు హిందూయేతరులు దూరంగా ఉండాలని కోరుతూ పోస్టర్లు వెలిశాయి. అతివాద సంస్థలు ఈ పోస్టర్లను అంటించాయని, వాటిని తొలగిస్తున్నామని పోలీసు అధికారులు తెలిపారు. ఘటనపై దర్యాప్తు జరుపుతున్నామని చెప్పారు. ‘గంగా మాత ఒడ్డున ఉన్న ఘాట్లు, దేవాలయాలు సనాతన ధర్మానికి, భారత సంస్కృతికి, విశ్వాసం, నమ్మకానికి ప్రతీకలు. వీటిపై విశ్వాసం కలిగి ఉన్న వారికి మాత్రమే స్వాగతం. నమ్మకం లేని వారు దూరంగా ఉండండి. ఇదేమీ పిక్నిక్ స్పాట్ కాదు’అని ఓ పోస్టర్లో హిందీలో రాసి ఉంది. ‘హిందూయేతరులకు ప్రవేశం నిషిద్ధం’, ‘ఇది విజ్ఞప్తి కాదు.. హెచ్చరిక’ అని ఈ పోస్టర్ పైన రాసి ఉంది. ఈ పోస్టర్లను విశ్వ హిందూ పరిషత్, భజరంగ్ దళ్ కార్యకర్తలు అంటిస్తుండగా తీసిన వీడియోలు సామాజిక మాధ్యమంలో వైరల్ అవుతున్నాయి.