న్యూఢిల్లీ, అక్టోబర్ 14: భారత్ దిగుమతులపై పెద్ద ఎత్తున టారిఫ్‌లను విధించటంతో అమెరికాకు నిలిచిపోయిన అన్ని రకాల పోస్టల్ సేవలు తిరిగి ప్రారంభమయ్యాయి. కేంద్ర కమ్యునికేషన్ల శాఖ మంగళవారం ఈ మేరకు ప్రకటన విడుదల చేసింది. దీని ప్రకారం, ఈఎంఎస్-ఇంటర్నేషనల్ మెయిల్, ఎయిర్ పార్సల్, రిజిష్టర్డ్ లెటర్స్, ప్యాకెట్స్, ట్రాక్డ్ ప్యాకెట్స్ సహా అన్ని రకాల క్యాటగిరీల్లో వినియోగదారులు యూఎస్‌కు పోస్టల్ సేవల్ని బుధవారం నుంచి బుక్ చేసుకోవచ్చు.
అయితే ప్రతి పోస్టల్ షిప్‌మెంట్‌పై 50 శాతం వరకు సుంకం వర్తిస్తుందని కేంద్రం తెలిపింది. పోస్టల్ షిప్మెంట్లపై వర్తించే కస్టమ్స్ సుంకాలను బుకింగ్ సమయంలో భారత్‌లో ముందుగానే వసూలు చేయనున్నట్టు పేర్కొన్నది. ట్రంప్ సర్కార్ కొత్త నిబంధనల్ని తీసుకురావడంతో ఆగస్టు 22 నుంచి భారత్ నుంచి అమెరికాకు పోస్టల్ సేవలు నిలిచిపోయాయి.